
భద్రాచలం రామయ్య సన్నిధిలో దేవీ నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజు మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వడంతో వారంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అమ్మవారు కరుణించి ఆర్థిక కష్టాలు తొలగిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయడంతోపాటు మధ్యాహ్నం మహా నివేదన రాజభోగం నిర్వహించనున్నారు. అలాగే 3.00 గంటలకు సామూహిక లక్ష కుంకుమార్చనలు, రాత్రి 8.00 గంటలకు సీతారాముల నిత్యకల్యాణమూర్తులకు తిరువీధి సేవ, శుక్రవారం నిజరూప అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రేపు సాయంత్రం దసరా మండపంలో శమీ పూజ, ఆయుధ పూజ నిర్వహించడంతోపాటు శ్రీరామలీలా మహోత్సవం కూడా నిర్వహిస్తారు. భక్తుల తాడికి ఎక్కువగా ఉండటంతో భౌతిక దూరం పాటించడంతోపాటు మాస్క్ ధరించినవారినే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. తరుచుగా చేతులను శానిటైజ్ చేసుకోవాలని ఆలయ సిబ్బంది హెచ్చరిస్తున్నారు. మాస్క్ ధరించనివారిని దర్శనానికి అనుమతివ్వడంలేదు. కరోనా జాగ్రత్తలపై భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు.