ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్నాయి. అనేక బహుళ జాతీయ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగం ఉంటుందా.. ఊడుతుందా అన్న టెన్షన్‌ ఉద్యోగుల్లో పెరుగుతోంది.  ఇప్పటికే అనేక సంస్థలు ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించాయి. అమెరికా కేంద్రంగా డిజిటల్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెటా,  అమెజాన్‌ కూడా ఈ నిర్ణయం తీసుకున్నాయి.


కొన్ని రోజుల క్రితం ఈ సంస్థల బాటలోనే గూగుల్‌ కూడా పయనించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆయా సంస్థలు అనేక మంది ఉద్యోగులను తొలగించాయి కూడా. గూగుల్‌ కూడా అదే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.  గత నెలలోనే మెటా, అమెజాన్‌ వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. అదీ ఎంత ఎక్కువగా అంటే.. ఎప్పుడూ లేనంత భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ప్రముఖ సోషల్ మీడియా బ్లాగింగ్ సంస్థ కూడా ప్రస్తుతం మూడో వంతు ఉద్యోగులతోనే నడుస్తోంది.


ఇక  ఫేస్‌ బుక్‌ మాతృ సంస్థ మెటా 11వేల మంది సిబ్బందిని ఇంటికి పంపేసింది కూడా.  2023వరకు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని అమెజాన్‌ సంస్థ కూడా ప్రకటించింది. గూగుల్‌లోనూ త్వరలోనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభం కాబోతోందట. మాంద్యం నేపథ్యంలో  ఖర్చు తగ్గించుకోవాలని గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌పై ఇటీవల ఒత్తిడి పెరగింది. అందుకే ఈ సంస్థ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.


గూగుల్‌లో ఇప్పటికే పని తీరు సరిగాలేని ఉద్యోగులను గుర్తించాలని ఆదేశాలు అందాయి. ఇప్పుడు ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 6శాతం మంది సిబ్బందిని తొలగిస్తారట. ఆ లెక్కన చూస్తే దాదాపు 10వేల మంది ఉద్యోగాలు త్వరలోనే పోనున్నాయి. వీరిని తొలగించేందుకు ప్రణాళిక సిద్ధమైందట. అయితే మొదటగా తొలుత దిగువ ర్యాంక్‌ ఉద్యోగులపై వేటు వేయాలని గూగుల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటు ఉద్యోగులు టెన్షన్‌తో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: