
ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్, థానా గంగోహ్ పరిధిలోని ఫతేపూర్ ధోలా గ్రామంలో ఫర్మాన్(30), రెహమాన్(16) ఇద్దరు సోదరులు నివసిస్తున్నారు. అయితే, జులై 18వ తేదీన ఈద్ కి మూడు రోజుల ముందు తన కోసం కొత్త ఫోన్ కొనుకున్నాడు ఫర్మాన్ . అతను ఇంటికి వచ్చిన తర్వాత ఫర్మాన్ తమ్ముడు రెహమాన్ కూడా తనకు ఫోన్ కావాలని అడిగాడు. ఫోన్ ఇవ్వడానికి ఫర్మాన్ నిరాకరించడంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త గొడవగా మారి రెహమాన్ తన అన్న ఫర్మాన్ తలపై కర్రతో బలంగా బాదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఫర్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
అన్న చనిపోవడంతో రెహమాన్ తీవ్రంగా భయపడ్డాడు రెహమాన్. దీంతో ఏం చేయాలో అర్థం కాకపోవడంతో ఫార్మన్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు. ఆపై ఇంట్లోనే గోతి తవ్వి పూడ్చిపెట్టాడు. ఆ తరువాత కొన్నిరోజుల పాటు అజ్ఞాతంలో ఉండి ఆ తరువా గ్రామంలోనే భయం లేకుండా తిరిగాడు. ఫర్మాన్ గురించి గ్రామస్తులు అడగ్గా.. పనికి వెళ్లాడని చెప్పుకొచ్చాడు రెహమాన్. అయితే, తాజాగా ఇంటి నుంచి తీవ్రమైన దుర్గంధం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు .
దీంతో ఇంటికి వచ్చిన పోలీసులు తలుపురు తెరిచి చూడగా తీవ్రమైన దుర్వాసన వచ్చింది.
పోలీసులు తమ దైన రీతిలో రెహమాన్‌ను విచారించారు. అప్పుడు రెహమాన్ అసలు విషయం బయట పెట్టాడు. తన సోదరుడిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తరువాత పోలీసులు ఇంట్లో తవ్వకాలు జరిపారు. ఫర్మాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. నిందితుడు రెహమాన్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, రెహమాన్, ఫర్మాన్ తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే మరణించారు. వీరికి ముగ్గురు అక్కాచెల్లెల్లు ఉండగా.. వారికి అప్పటికే వివాహం కావడంతో సోదరులిద్దరూ కలిసే నివసిస్తున్నారు.