తెలంగాణలో బిజెపి ముందుకు వెళుతున్న తీరు కాస్తా విమర్శలకు దారి తీస్తున్న తరుణంలో, గతంతో పోలిస్తే ఆ పార్టీ బలం పుంజుకుంది అనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా , టిఆర్ఎస్ పార్టీ అధిక్యం దక్కించుకోవడం, ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ , ఎంఐఎం వంటివి ఉండటం, చివరి స్థానంలో బీజేపీ ఉండడం షరా మామూలుగా ఉంటూ వస్తోంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడింది. ఇక అధికార పార్టీ టిఆర్ఎస్ సైతం ప్రజల ఆగ్రహం ఎదుర్కొంటోంది. క్రమక్రమంగా బిజెపి తన బలాన్ని తెలంగాణలో నిరూపించుకుంటూ వస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో హోరాహోరీగా ఈ రెండు పార్టీల మధ్య పోరు నడుస్తుండడం చూస్తుంటే, బీజేపీకి అధికారం దక్కడం ఇంకెంతో దూరంలో లేదు అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. 



అసలు బిజెపి ఈ స్థాయిలో బలం పుంజుకోవడానికి ప్రధాన కారణం టిఆర్ఎస్ పార్టీ అనేది విశ్లేషకుల అభిప్రాయం. టీఆర్ఎస్ నుంచి స్ఫూర్తి పొంది ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో సెంటిమెంటును రగిల్చి ప్రత్యేక తెలంగాణ సాధించడంతోపాటు, టిఆర్ఎస్ పార్టీకి తిరుగులేకుండా చేసుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే విధంగా బిజెపి హిందుత్వం ను రెచ్చగొట్టి సక్సెస్ అవ్వాలని చూస్తోంది. ముఖ్యంగా పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ వంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా హిందువులలో వేడి పుట్టించి, దానిని ఓట్ల రూపంలో తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. టిఆర్ఎస్ పార్టీ పేరు చెబితే ప్రత్యేక తెలంగాణ ఏ విధంగా గుర్తుకు వస్తుందో, బిజెపి పేరు చెబితే హిందుత్వం గుర్తుకు వచ్చే విధంగా ప్రయత్నిస్తూ ముందుకు సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. 



మొన్నటివరకు టిఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు మధ్య స్నేహం ఉండేది. ఎప్పుడైతే బిజెపి పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ అంటూ హడావుడి చేసిందో, ఆ తర్వాత నుంచి టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు శత్రువులుగా మారినట్లు గా విమర్శలు చేసుకుంటున్నారు. అసలు ఎంఐఎం అనేది పాతబస్తీకి మాత్రమే పరిమితమైన పార్టీ. కానీ ఇప్పుడు తమిళనాడు, పశ్చిమబెంగాల్, కాశ్మీర్ ఇలా దేశమంత విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం జనాభా ను ఏకం చేసి వారందరికీ ప్రాతినిధ్యం వహించాలనే విధంగా ఎంఐఎం పార్టీ ప్రయత్నిస్తోంది. దీంతో ఇప్పుడు ఆ పార్టీని కట్టడి చేసేందుకు హిందువులకు అండగా నిలబడేందుకు బిజెపి ప్రయత్నిస్తున్నట్లుగా హిందువుల్లో ఒక అభిప్రాయాన్ని కలిగించేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది.  ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లో మాత్రమే కాకుండా, తర్వాత సైతం ఇదే రకమైన స్పీడ్ తో ముందుకు వెళ్లి సక్సెస్ అవ్వాలని బిజెపి ప్రయత్నిస్తోంది. ఇదంతా టిఆర్ఎస్ పార్టీ నుంచి స్ఫూర్తి పొందడమే ఇక్కడ కొసమెరుపు.



మరింత సమాచారం తెలుసుకోండి: