ఇపుడిదే ప్రతిపక్షాల మధ్య పెద్ద సమస్యగా మారిపోతోంది. హిందుత్వమన్నా, గుళ్ళు, గోపురాలన్నా ఎప్పటి నుండో బీజేపీ లేకపోతే హిందుత్వ సంస్ధలు పేటెంటు హక్కుల కోసం కష్టపడుతున్నాయి. అయితే తాజాగా వీటికి పోటీగా తెలుగుదేశంపార్టీ కూడా తయారైంది. అందుకనే రాష్ట్రంలో కొద్దిరోజులుగా దేవాలయాలపై జరుగుతున్న దాడుల ఘటనలను క్యాష్ చేసుకునేందుకు బీజేపీ, టీడీపీలు బాగా పోటీ పడుతున్నాయి. మరి ఈ రెండుపార్టీల్లో ‘హిందుత్వంపై’ దేనికి పేటెంట్ హక్కులు దక్కుతాయనే విషయమే ప్రస్తుతానికి సస్పెన్సుగా మారింది. నిజానికి ఈ రెండుపార్టీలకూ హిందుత్వంపై చిత్తశుద్ది లేదని గతంలో చాలాసార్లు రుజువయ్యింది. కాకపోతె తొందరలోనే తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక జరగబోతోంది కాబట్టి లబ్దిపొందాలన్నా తాపత్రయంతోనే ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయంతే.




గతంలో ఎప్పుడైనా హిందుత్వమని, గుళ్ళు గోపురాలని చంద్రబాబునాయుడు కానీ లేకపోతే టీడీపీ నేతలు కానీ ఇపుడు చేస్తున్నంత హడావుడి చేశారా ? హడావుడి చేయకపోగా దేవాలయాలను కూల్చేసిన చరిత్రను చంద్రబాబు మూటకట్టుకున్నారు. మొన్నటి ఐదేళ్ళ పాలనలో విజయవాడలోనే 35 దేవాలయాలను చంద్రబాబు కూల్చేయించారు. వాటిని తిరిగి ఎక్కడా పునర్నినిర్మాణం కూడా చేయలేదు. దశాబ్దాల చరిత్రున్న గుళ్ళని కూడా చూడకుండా విగ్రహాలతో పెకిలించేశారు. ఇపుడా విగ్రహాలు ఎక్కడున్నాయో కూడా సరైన సమాచారం లేదు. ఇక గోదావరి పుష్కరాలను కూడా తన పబ్లిసిటీ పిచ్చికి వాడుకుని 30 మంది చావుకు కారణమయ్యారు చంద్రబాబు. కాబట్టి చంద్రబాబు దేవుళ్ళన్నా, భక్తన్నా పెద్దగా నమ్మకం లేదని అర్ధమైపోతోంది.




ఇదే సమయంలో బీజేపీని తీసుకుంటే దాదాపు నాలుగేళ్ళు టీడీపీతో మిత్రపక్షంగా కొనసాగింది. ఆ సమయంలో చంద్రబాబు 35 గుళ్ళని కూల్చేస్తుంటే చూస్తు కుర్చున్నదే తప్ప అభ్యంతరం పెట్టలేదు. విచిత్రమేమిటంటే ఆ సమయంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నది బీజేపీ ఎంఎల్ఏ పైడికొండల మాణిక్యాలరావే. గోదావరి పుష్కరాల మొదటిరోజు తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయినపుడు కూడా మంత్రి మాణిక్యాలరావే. టీటీడీ ఆధీనంలో ఉన్న భూములను వేలంపాట ద్వారా అమ్మేయాలని నిర్ణయించినపుడు కూడా పైడికొండలే మంత్రి. పైగా అప్పటి బోర్డులో బీజేపీ సభ్యుడు కూడా ఉన్నారు. అంటే జరుగుతున్నది చూస్తుంటే బీజేపీకి కూడా కేవలం ఓట్ల రాజకీయమే తప్ప నిజంగా దేవుళ్ళన్నా, భక్తన్నా నమ్మకం లేదని తెలిసిపోతోంది. నిజంగానే బీజేపీకి దేవుళ్ళపై అంత నమ్మకమే ఉంటే దేవాలయాలను కూల్చేసినపుడే పైడికొండలు రాజీనామా చేసుండేవారు. మొత్తంమీద రెండుపార్టీలు ఇపుడు హిందుత్వమే ప్రధాన అజెండాతో రెచ్చిపోతున్నాయంటే కేవలం పెటెంటు హక్కుల కోసమే అని అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: