అంతరిక్షంలో ఎప్పుడూ కూడా మన ఊహకందని విషయాలు ఇంకా మిస్టరీలు జరుగుతూ ఉంటాయి. అంతరిక్షంలో జరిగే విషయాల గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు తెలుసుకోవాలి.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఉండే శాస్త్రవేత్తలు అప్పుడప్పుడూ మరమ్మతులు, ప్రయోగాల కోసం.. బయట శూన్యంలో స్పేస్‌ వాక్‌ చేస్తుంటారు. అలా స్పేస్‌ వాక్‌ చేసి, తిరిగి ఐఎస్‌ఎస్‌లోకి వెళ్లిన తర్వాత.. తమకు 'ఏదో కాల్చిన మాంసం'.. 'బాగా వేడి చేసిన ఇనుము నుంచి వెలువడిన లేదా వెల్డింగ్‌ చేసినప్పుడు వెలువడే పొగ' వంటి వాసన వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే ఐఎస్‌ఎస్‌ బయట అంతరిక్షంలో భారీస్థాయి రేడియేషన్‌ ఉంటుందని.. దానికి లోనైనప్పుడు స్పేస్‌ సూట్, ఇతర పరికరాల్లోని పరమాణువులు తీవ్రస్థాయి కంపనాల (హైఎనర్జీ వైబ్రేషన్స్‌)కు గురవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వారు తిరిగి ఐఎస్‌ఎస్‌లోనికి వచ్చాక ఆ హైఎనర్జీ పార్టికల్స్‌లో కూడిన గాలిని పీల్చడం వల్ల.. వెల్డింగ్‌ తరహా వాసన వస్తున్నట్టు తేల్చారు.సాధారణంగా వివిధ రసాయనాలను బట్టి పదార్థాలకు రుచి వస్తుంటుంది.


అలాగే అంతరిక్షంలో నక్షత్రాలు, ఇతర ఖగోళ పదార్థాల రుచినీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మన పాలపుంతలోని సాగిట్టారియస్‌ బీ2 గా పిలిచే ధూళిమేఘంలో ఈథైల్‌ ఫార్మేట్‌ రసాయనం ఉన్నట్టు గుర్తించారు. దానితో అది గులాబీ జాతికి చెందిన 'రాస్ప్‌బెర్రీ' పండ్ల రుచిని తలపిస్తుందని పేర్కొన్నారు. ఇక నక్షత్రాలు, ఖగోళ పదార్థాల్లో ఆల్కహాల్, యాసిడ్లు, ఆల్డిహైడ్స్‌గా పిలిచే రసాయనాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకు అనుగుణంగా వగరు, పులుపు, ఒకరకమైన చేదు వంటి రుచులను తలపించొచ్చని అంచనా వేశారు.అంతరిక్షంలో మన స్పర్శ విషయంలో ఎలాంటి తేడాలు కనిపించలేదని కెనడా ఆస్ట్రోనాట్‌ క్రిస్‌ హ్యాడ్‌ఫీల్డ్‌ వెల్లడించారు. అయితే వరుసగా రెండు నెలలపాటు ఐఎస్‌ఎస్‌లో గడిపిన వ్యోమగాముల్లో పాదాల అడుగుభాగం గరుకుదనం తగ్గి మెత్తగా అయితే.. పాదాలపైన చర్మం అత్యంత సున్నితంగా మారుతోందని గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: