
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు పిరికివాడని అందరికీ తెలిసిందే. కానీ నరేంద్రమోడి అంటే మరీ ఇంతగా భయపడుతున్నారనే విషయం ఇపుడే బయటపడింది. చంద్రబాబు ప్రచారం చేస్తున్న విధానం చూస్తున్న వాళ్ళకు ఆయనెంత పిరికివాడో బాగా అర్ధమైపోతోంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఏపికి ప్రత్యేకహోదా, విశాఖ రైల్వేజోన్ అంశాలనే ప్రస్తావిస్తున్నారు. ఈ రెండు అంశాలపై పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చాలా మాటలు చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాటిగురించే మాట్లాడటం లేదన్నారు. హోదా, రైల్వేజోన్ సాధించటంలో జగన్ ఫెయిలయ్యారంటూ మండిపోతున్నారు. ఇవే అంశాలపై అప్పట్లో తమ ఎంపిలను రాజీనామా చేయమని పదే పదే డిమాండ్ చేసిన జగన్ ఇపుడు తన ఎంపిలతో రాజీనామాలు చేయిస్తారా అని చంద్రబాబు అడగటమే ఆశ్చర్యంగా ఉంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రత్యేకహోదా, రైల్వేజోన్ అంశాలకు సమాధికట్టిందే నరేంద్రమోడి+చంద్రబాబు. అప్పట్లో మిత్రపక్షాలుగా నాలుగేళ్ళు కంటిన్యు అయిన చంద్రబాబు కేంద్రం ప్రత్యేకహోదా విషయంలో ఎలా చెబితే అలా ఆడిన విషయం అందరికీ తెలిసిందే. 2014 ఎన్నికలకన్నా 2019లో నరేంద్రమోడి మరింత బలోపేతమయ్యారు. అలాంటిది 2014లో హోదా, రైల్వేజోన్ సాధించటం చంద్రబాబు ఫెయిలైతే 2019లో జగన్ ఏ విధంగా సాధించగలరు ? ప్రజల కోణంలో ఆలోచిస్తే ఏపి ప్రయోజనాలను కాపాడటంలో చంద్రబాబు, జగన్ ఇద్దరు ఫెయిలయ్యారనటంలో సందేహంలేదు. కానీ ఫెయిల్యూర్లో జగన్ కన్నా చంద్రబాబు పాత్రే ఎక్కువుందన్నది కూడా వాస్తవమే.
తన ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకుంటు తప్పంతా జగన్ దే అని చంద్రబాబు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. సరే ఎవరి ఫెయిల్యూర్ ను వాళ్ళు అంగీకరించరన్న విషయం అందులోను చంద్రబాబు అసలొప్పుకోరన్న విషయం తెలిసిందే. నిజానికి హోదా, రైల్వేజోన్ సాధించలేని జగన్ పై విమర్శలు చేసినట్లే పై రెండు ఇవ్వటానికి అడ్డుపడుతున్న నరేంద్రమోడిని కూడా చంద్రబాబు నిలదీసుండాలి. కానీ చంద్రబాబు మాత్రం ఇవ్వకుండా భీష్మించుకుని కూర్చున్న మోడి గురించి పొరబాటున ఎక్కడా మాట్లాడకుండా కేవలం జగన్ గురించే మాట్లాడుతున్నారు. ఇక తాను అధికారంలో ఉన్నపుడు ఎంపిలతో చంద్రబాబు రాజీనామాలు చేయించి ఉంటే ఇపుడు ఇదే అంశంపై జగన్ను డిమాండ్ చేసే అర్హత ఉండేది. అప్పుడు చంద్రబాబు రాజీనామాలు చేయించకుండా ఇపుడు మాత్రం వైసీపీ ఎంపిలతో రాజీనామాలు చేయించమంటే జగన్ ఏమన్నా పిచ్చోడా చేయించేందుకు ?