తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇదే అర్ధంలో ఉన్నాయి. ‘తమపార్టీ నేతల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతమందిని అరెస్టు చేస్తే తమకంత మంచిద’ని అచ్చెన్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంటే నేతలను అరెస్టు చేయించటం ద్వారా పార్టీకి జనాల్లో సింపతి రావాలని అచ్చెన్న కోరుకంటున్నారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే హత్య కేసులో మాజీమంత్రి కొల్లు రవీంద్ర, ఇఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్న, ట్రాన్స్ పోర్టు కంపెనీలో అవకతవకలకు పాల్పడినందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి, సంగండైరీలో అవినీతి, అక్రమాల కారణంగా మాజీ ఎంఎల్ఏ దూళిపాళ నరేంద్ర, అరెస్టయ్యారు. జగన్ పై మార్ఫుడు వీడియోతో జనాలను తప్పుదోవ పట్టించిన కారణంగా మరో మాజీమంత్రి దేవినేని ఉమపైన కూడా అరెస్టు కత్తి వేలాడుతోంది.




నిజానికి టీడీపీ నేతల్లో ఎవరిని కూడా ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి అరెస్టుచేయలేదు. అచ్చెన్నయినా కొల్లు అయినా వాళ్ళంతట వాళ్ళుగా ఇరుక్కున్నారు కాబట్టే అరెస్టయ్యారు. జేసీ అయితే అధికారాన్ని అడ్డంపెట్టుకుని పాల్పడని అక్రమాలు లేవు. ట్రాన్స్ పోర్టు బస్సుల ముసుగులో ప్రభాకర్ రెడ్డి పాల్పడిన అక్రమాలన్నీ ఆధారాలతో సహా బయటపడ్డాయి కాబట్టే అరెస్టయ్యారు. తాజాగా అరెస్టయిన నరేంద్ర మీద కూడా ఎన్నో ఆరోపణలు ఎప్పటినుండో వినబడుతున్నాయి. అయితే ఇంతకాలం ఏ ప్రభుత్వం కూడా ఆయనజోలికి వెళ్ళలేదంతే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అరెస్టయిన వారంతా తమపై ప్రభుత్వం కక్షసాధింపులకు దిగుతోందని, వేధిస్తోందని చెబుతున్నారు. వీళ్ళ వాదనను బలంగా ఎల్లోమీడియా జనాల్లోకి తీసుకెళుతోంది. అంతేకానీ తాము అవినీతికి పాల్పడలేదని, అక్రమాలు చేయలేదని, హత్యకేసుతో సంబంధం లేదని చెప్పటంలేదు.




అచ్చెన్న తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఇప్పటికి అరెస్టయిన నేతలు+మరింతమంది నేతల అరెస్టులు జరిగితే తమకు జనాల్లో సింపతి వస్తుందని అనుకుంటున్నట్లుంది. ఏ తప్పు చేయకపోయినా నేతలను అరెస్టు చేస్తే జనాల్లో సింపతి వస్తుంది కానీ అవినీతి, అక్రమాలు, హత్య కేసుల్లో ఇరుక్కున్నవారిని అరెస్టు చేస్తే సింపతి ఎలాగొస్తుంది ? కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన తర్వాత జగన్ పై చాలా కేసులు పెట్టారు. అవన్నీ రాజకీయ ప్రేరేపితమైన కేసులని అందరికీ తెలిసిందే. ఈ విషయంలో జనాలకు బాగా క్లారిటి ఉంది కాబట్టే 2014 ఎన్నికల్లో అధికారం అప్పగించకపోయినా 67 సీట్లలో గెలిపించారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్ను వేధించటంతో పాటు పాలనలో చేసిన తప్పుల కారణంగానే 2019లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు. అంతేకానీ అచ్చెన్న అనుకుంటున్నట్లు కేవలం  సింపతితోనే జగన్ అధికారంలోకి రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: