ప్ర‌స్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ దేశాన్ని వ‌ణికిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ఉప‌ద్ర‌వాన్ని అంచ‌నా వేయ‌డంలోనూ.. త‌ద‌నంత‌రం దీని వ్యాప్తి నియంత్ర‌ణ‌కు స‌త్వ‌ర చ‌ర్య‌లు చేప‌ట్టడంలోనూ అటు కేంద్ర ప్ర‌భుత్వం, ఇటు కొన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలూ విఫ‌ల‌మ‌య్యాయ‌ని అంగీక‌రించ‌క త‌ప్ప‌దు. దేశ‌వ్యాప్తంగా వైర‌స్ బారిన జ‌నం ల‌క్ష‌ల సంఖ్య‌లో ప‌డుతున్న స‌మ‌యంలో రాష్ట్రాలు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై ప్రధాని మోదీ ప‌లువురు ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌స్తుతం చేప‌డుతున్న, చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై  చ‌ర్చించారు. కాగా ఇదే విష‌యమై మోదీ తాను చెప్ప‌ద‌ల‌చుకున్న‌దే త‌ప్ప.. తాము చెప్పేది విన‌లేద‌ని ప‌రిస్థితుల నియంత్ర‌ణ‌కు మ‌రింత ఉప‌యోగ‌క‌రంగా ప్ర‌ధాని త‌మ‌తో చ‌ర్చించి ఉండాల్సిందంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఝార్ఖండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరేన్ కాస్త అసంతృప్తితో కూడిన వ్యాఖ్య‌లు చేశారు.

దీనిపై ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స్పందిస్తూ హేమంత్ సొరేన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు తెర‌తీశాయి. జ‌గ‌న్ ఏమ‌న్నారంటే "డియ‌ర్ హేమంత్ సొరేన్‌.. మీరంటే నాకు ఎంతో గౌర‌వం. ఓ సోద‌రుడిగా మీకు నేను చెప్పేదేమిటంటే..ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల్లో విమ‌ర్శనాత్మ‌క రాజ‌కీయాలు స‌రికాదు. అవి దేశాన్ని మ‌రింత బ‌ల‌హీన‌ప‌రుస్తాయి. కోవిడ్ పై యుద్ధంలో విభేదాలు వీడాలి. మ‌న‌మంతా ప్ర‌ధాని మోదీకి అండ‌గా నిల‌వాలి. అప్పుడే ఆయ‌న మ‌రింత స‌మ‌ర్థంగా ప‌ని చేయ‌గ‌ల‌రు" అని ట్విట్ట‌ర్‌లో వ్యాఖ్యానించారు. దీనిని చూసిన ప‌లువురు విమ‌ర్శ‌కులు సీఎం జ‌గ‌న్‌ది మోదీపై ప్రేమా, గౌర‌వ‌మా, లేక భ‌యంతో కూడిన విన‌య‌మా అంటూ కామెంట్‌ చేస్తున్నారు.హేమంత్ సొరేన్ చేసిన వ్యాఖ్య‌ల్లో హేతుబద్ధ‌త ఉన్న‌ప్ప‌టికీ వైఎస్ జ‌గ‌న్ దీనిపై ఇలా స్పందించ‌డం వెనుక కార‌ణాలేమై ఉంటాయ‌ని ప‌లువురు రాజ‌కీయ‌నాయ‌కులు త‌మ‌దైన శైలిలో విశ్లేషిస్తున్నారు.

నిజానికి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ది ఎవ‌రినీ లెక్క‌జేసే మ‌న‌స్త‌త్వం కాద‌ని అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న తాను న‌మ్మింది చేస్తారు. ఏపీలో కోవిడ్ వైద్య సేవ‌లు అందించేలా ప్రైవేటు ఆస్ప‌త్రుల‌ను ఆదేశించ‌డంలోనూ ఆయ‌న త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రిచారు. అయితే ఆక్సిజ‌న్, వ్యాక్సిన్ల కొర‌త, వైద్య సుదుపాయాలు లేక‌పోవ‌డం వంటి లోపాలు దేశవ్యాప్తంగా ఉన్న నేప‌థ్యంలో ఝార్ఖండ్ సీఎం హేమంత్‌ సొరేన్ త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రస్తుతం ప్ర‌ధాని మోదీని గ‌ట్టిగా వ్య‌తిరేకించే తెగువ మ‌మ‌తా బెన‌ర్జీ వంటి ఒక‌రో ఇద్ద‌రో నేత‌ల‌కు త‌ప్ప మ‌రెవ‌రికీ  లేద‌న్న‌ది తెలిసిందే. ఈ సమ‌యంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి వంటి గొప్ప నాయ‌కుడి వార‌సుడైన‌ సీఎం జ‌గ‌న్‌కు సొరేన్ వ్యాఖ్య‌ల‌ను ప‌నిగ‌ట్టుకుని వ్య‌తిరేకించాల్సిన అవ‌స‌రం లేద‌ని, దీనివెనుక ఆయ‌న కేసుల గురించిన భ‌యం క‌నిపిస్తోంద‌ని ఒడిషాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ స‌ప్త‌గిరి ఉలాకా వంటివారు  విమ‌ర్శ‌లు చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: