నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో కేసీఆర్ రాజకీయం నల్లేరుపై నడకలా సాగింది. ఆయన ఆడింది ఆట పాడింది పాటగా ఉంది. తెలంగాణలో అసలు ప్రతిపక్షాలు ఉన్నాయా అన్నట్టుగా సాగింది తెలంగాణ రాజకీయం.. తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ విపక్షంగా ఉన్నా.. ఇన్నాళ్లు అది ఎలాంటి ప్రభావం చూపలేకపోయిందనే చెప్పాలి.. కాంగ్రెస్ రాజకీయం అంటేనే అంత.. అందులోనూ విజయవంతమైన నాయకత్వం అన్నది కాంగ్రెస్‌లో కనిపించలేదు.


కానీ ఇప్పుడు  సీన్ ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది.  రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇన్నాళ్లు కేసీఆర్‌ను మనమేం చేస్తాంలే అనుకున్న నేతలు కూడా ఇప్పుడు సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. పార్టీలో ఆత్మ విశ్వాసం అన్నది కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి కూడా వ్యూహత్మకంగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. మొన్నటి ఇంద్రవెల్లి సభలో దళిత, గిరిజన దండోరా నిర్వహించిన రేవంత్‌ రెడ్డి ఇప్పుడు మిగిలిన వర్గాలనూ ఏకం చేస్తున్నారు.


అందులో భాగంగానే ఇప్పుడు మైనారిటీలనూ చేరదీస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీకి మైనార్టీల మద్దతు బలంగా ఉండేది.. ఆ తర్వాత కాలంలో వారు దూరమయ్యారు. ఇప్పుడు వారిని మరోసారి దగ్గర చేసుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. తాజాగా నిర్వహించిన మైనారిటీ గర్జనలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలకు శత్రువు అయిన కేసీఆర్‌ను కొట్టాలంటే అసదుద్దీన్ ఒవైసీ అడ్డంగా ఉన్నారని రేవంత్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవలసిన బాధ్యత మైనార్టీల మీద ఉందని నొక్కి చెప్పారు.


కాంగ్రెస్ కు లోక్ సభలో 200 సీట్లు ఉంటే, కేంద్ర ప్రభుత్వం సిఎఎ, ఎన్.ఆర్.సి, ట్రిపుల్ తలాఖ్ వంటి చట్టాలను తెచ్చేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇకపై మైనార్టీలు కారునో, పతంగినో నమ్ముకుంటే లాభం లేదంటున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని బలపరచాలని రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న రేవంత్.. అందులో మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ లు ఇస్తే ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు వస్తాయని లెక్కలు వేసి చెప్పారు. మొత్తానికి  రేవంత్  కేసీఆర్‌ను దెబ్బ కొట్టే ఏ విషయాన్ని వదిలిపెట్టడం లేదనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: