కడప సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా అన్న సంగతి తెలిసిందే. ఆయన సీఎం అయ్యాక కడప జిల్లాలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. పులివెందుల వంటి పట్టణాలు కూడా డెవలప్ అవుతున్నాయి. అలాగే సొంత జిల్లాకు సాధ్యమైనంతగా పరిశ్రమలు తెచ్చేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఇక తాజాగా సొంత జిల్లాకు జగన్ మరో వరం ప్రకటిస్తున్నారు.


అదేంటంటే.. కడప జిల్లాలో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. కడప జిల్లాలో ఈ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుపై కేంద్ర బృందం పరిశీలన జరుపుతోంది. ఈ పరిశీలన కోసం ఏపీలో కేంద్ర బృందం రెండు రోజుల పాటు పర్యటిస్తోంది. ఇప్పటికే ఈ  కేంద్ర బృందం మంగళగిరిలోని ఏపీఐఐసీ ఛైర్మన్, ఎండీలతో సమావేశమైంది. కడప జిల్లా కొప్పర్తిలో ఏపీఐఐసీ భూములు, మౌలిక సదుపాయాలను ఈ బృందం పరిశీలించి కేంద్రానికి నివేదిక పంపుతుంది.


పీఎం మిత్ర పార్క్స్ పథకానికి సంబంధించి కొప్పర్తిలో ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర బృందానికి ఏపీఐఐసీ తెలియజేసింది. కొప్పర్తి సమీపంలో ఇప్పటికే  వివిధ సంస్థల స్పిన్నింగ్ మిల్లులు, అపారెల్ ఫ్యాక్టరీలు, టెక్స్ టైల్ పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పటికే కొప్పర్తి ప్రాంతంలో ప్రస్తుతం 1.3 లక్షల మంది సెమీ స్కిల్డ్, 21,511 మంది నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నారు.


ఇక్కడ పీఎం మిత్ర పార్కు ఏర్పాటైతే.. దీని ద్వారా లక్ష మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుంది. అలాగే పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రధాన మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ జియడ్ అప్పారెల్ పథకం కింద దేశంలో ఏడు టెక్స్ టైల్  పార్కులు ఏర్పాటు చేయబోతున్నారు. వాటిలో ఒకదాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఏపీ  కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కొప్పర్తి వద్ద అభివృద్ధి చేస్తున్న జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ లోని 1188 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని ఏపీ అడుగుతోంది. మరి జగన్ ప్రతిపాదనకు మోదీ ఓకే అంటే కడప జిల్లాకు ఓ భారీ ప్రాజెక్టు దక్కినట్టే అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: