పవన్ కల్యాణ్ మళ్లీ ఆలోచనలో పడిపోయాడా.. తెలుగుదేశంతో పొత్తుల విషయంలో గందరగోళంలోనే ఉండిపోయాడా.. ఇంకా ఏ విషయం తేల్చుకోలేకపోతున్నారా.. అటు బీజేపీతోనూ.. ఇటు టీడీపీతోనూ ఏకకాలంలో స్నేహం పొసగదని జనసేనానికి అర్థమైపోయిందా.. అందుకే ఇప్పుడు మాట మార్చేశారా.. మొన్నటికి మొన్న విపక్ష ఓటు చీలనివ్వబోనని తేల్చి చెప్పిన జనసేనాని.. ఇప్పుడు మాత్రం.. పొత్తుల గురించి అప్పుడే తొందరేమొచ్చిందని మాట్లాడటం విశ్లేషకులను సైతం ఆలోచనలో పడేస్తోంది.


రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని కచ్చితంగా చెబుతున్న పవన్‌ కల్యాణ్.. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ప్రయత్నాన్ని బలంగా తీసుకెళ్తామంటూనే ఎవరెవరు కలిసి వస్తారో నాకు ఇప్పటికీ తెలియదనడం విశేషం. ప్రత్యామ్నాయం అనేది బలమైన శక్తిగా ఉండాలంటున్న పవన్‌ కల్యాణ్‌.. రాష్ట్రాన్ని రక్షించాలంటే వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని మళ్లీ చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే రాష్ట్రానికి మరోసారి తీవ్ర నష్టం అంటూనే.. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.


పొత్తుల గురించే ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదంటున్న పవన్‌.. రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరూ కలిసి చర్చించాలంటున్నారు. ఇవాళ్టికీ మాకు భాజపాతోనే పొత్తు ఉందన్న పవన్‌ కల్యాణ్‌... ఏపీ పరిస్థితిని మా మిత్రపక్షం భాజపా నాయకత్వ దృష్టికి తీసుకెళ్తానని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే పవన్ కల్యాణ్ ఇంకా గందరగోళం నుంచి బయటపడినట్టు కనిపించడం లేదు. ఎవరితో ఎలా ముందుకు వెళ్లాలో తేల్చుకోలేక సతమతం అవుతున్నారని అనిపించక మానదు.


ఏపీలో అప్పుడే ఎన్నికలు లేని మాట నిజమే.. ఇంకా రెండేళ్ల సమయం ఉన్నమాటా నిజమే.. కానీ.. ఇప్పటి నుంచి ఇచ్చే సంకేతాలే కీలకం అవుతాయి.. ఇప్పటి నుంచి ఓ స్పష్టత అన్నది లేకపోతే.. అప్పటికీ గందరగోళం తప్పదు. మరి ఇకనైనా జనసేనాని పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి సారిస్తే స్పష్టత సాధ్యమవుతుంది. ఈ గందరగోళానికి పార్ట్ టైమ్ పాలిటిక్స్ కూడా ఓ కారణమే అన్న వాదన లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: