కాంగ్రెస్ పార్టీ.. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ.. ఎన్నో మార్పులకు కారణమైన పార్టీ.. అలాంటి పార్టీ ఇప్పుడు దేశంలో క్రమంగా ఉనికిని కోల్పోతుంది. బీజేపీ విజృంభణతో కాంగ్రెస్ పరిస్థితి చరిత్రలోనే ఎన్నడూ లేనంత దారుణంగా తయారైంది. ఒకప్పుడు దేశం మొత్తం ఏలిన కాంగ్రెస్‌ ఇప్పుడు 29 రాష్ట్రాలున్న ఇండియాలో కేవలం రెండు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉందంటే.. ఆ పార్టీ దీన స్థితి ఎలాఉందో అర్థం చేసుకోవచ్చు.


అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు పునరుజ్జీవం కోసం ఆరాటపడుతోంది. పార్టీ ప్రక్షాళన గురించి మే 13 నుంచి రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగనున్న చింతన్ శివిర్ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ వల్ల ప్రతి ఒక్కరికీ మేలే జరిగిందని. ఇప్పుడు ఆ రుణాన్ని పూర్తి స్థాయిలో చెల్లించే సమయం వచ్చిందని ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అంటున్నారు. మే 13 నుంచి జరిగే చింతన్ శివిర్ ఏర్పాట్లపై సోనియా నేతృత్వంలో ఆమె సోమవారం చర్చించారు.


దాదాపు 400 మంది కాంగ్రెస్ నేతలు చింతన్ శివిర్ లో పాల్గొంటారని భావిస్తున్నారు. అన్ని కోణాల్లో సమతుల్య ప్రాతినిధ్యం కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చింతన్ శివిర్ లో ఆరు గ్రూపులుగా చర్చలు ఉంటాయి. ఏ గ్రూప్ లో పాల్గొనాలనే దానిపై ప్రతినిధులకు ఇప్పటికే తెలియజేశారు.  మే 15వ తేదీ మధ్యాహ్నం నవ్ సంకల్ప్ తీర్మానాలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించిన తర్వాత అమలు చేస్తారు. పార్టీ పునరుజ్జీవనానికి ఉదయపూర్ నుంచి స్పష్టమైన సందేశం వెళ్లాలని సోనియా ఆకాంక్షిస్తున్నారు.


కాంగ్రెస్ వేదికల్లో ఆత్మ విమర్శ చేసుకోవడం అవసరం అంటున్న సోనియా గాంధీ ఆ విమర్శలు ఆత్మవిశ్వాసం, నైతిక స్థైర్యం క్షీణించి, వినాశకర వాతావరణం వ్యాప్తి చెందే విధంగా ఉండరాదని చెబుతున్నారు. చింతన్ శివిర్ అనేది కేవలం ఒక ఆచారంగా మారకూడదంటున్నారు సోనియా. కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే సైద్ధాంతిక, ఎన్నికల నిర్వాహక సవాళ్లను ఎదుర్కోవాలని పిలుపు ఇచ్చారు. చింతన్ శివిర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నూతనోత్సాహం నింపు కోవాలని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: