మహాసభలు జరిగే ప్రాంగణాన్ని తెలుగు భాషా పరిరక్షణకు పాటుపడిన రాజరాజనరేంద్రుడి పేరుతో వ్యవహరిస్తారు. ఆదికవి నన్నయ్య వేదికపై ప్రారంభ సభ, సమాపన సభలు, తెలుగు వెలుగుల సభ వంటివి జరుగుతాయి. తెలుగు అకాడమి నిర్మాత, అధికార భాషా సంఘం చట్టం తెచ్చిన తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు వేదికపై కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు. మొత్తం 30 సదస్సులలో దేశ, విదేశాల నుంచి విచ్చేసిన 800 మంది ప్రతినిధులు పాల్గొంటారు.
ఈనెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మహాసభలను ప్రారంభిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు తెలుగు వెలుగుల సభలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొంటారు. వంద మందికిపైగా రచయితలు తమ గ్రంథాలను ఈ సభల్లో ఆవిష్కరించే అవకాశం ఉంది. భాష కోసం విలువలతో కూడిన సామాజిక వ్యవస్థ కోసం ఈ మహాసభలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ మహాసభల గౌరవాధ్యక్షులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్, అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టరు జీవీ పూర్ణచంద్ పేర్కొన్నారు.
తెలుగు భాష గొప్పదనాన్ని, తెలుగు భాష తీయదనాన్ని ఈ తరానికి వారసత్వంగా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహాసభల గౌరవాధ్యక్షులు భావిస్తున్నారు. ఇది సంధి కాలమని.. తెలుగును ఇప్పుడు కాపాడుకోలేకపోతే.. ముందు ముందు భాష మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని వారు హెచ్చరిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి