వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పొత్తులు పెట్టుకొని ముందుకు సాగుతున్న టీడీపీ, జనసేన, బీజేపీలు ఉమ్మడి మ్యానిఫెస్టోపై ఇంకా ముడి పడలేదు. ఎవరికి వారు మౌనంగా ఉన్నారు. టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలపై బీజేపీ నుంచి భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతో టీడీపీ.. వైసీపీ మాదిరిగా ఉచిత పథకాలు ఇచ్చేందకు సిద్ధం అవుతోంది.


అందులో భాగంగా ఇప్పటికే మినీ మ్యానిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది. ఇందులో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అమ్మకు వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకు రూ.15వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఇక వీటికి తోడు ఇతర పథకాలు కూడా ఉచితంగా ఉన్నాయి. అయితే ఇది ఉమ్మడి మ్యానిఫెస్టో కాదు. పొత్తుల కంటే ముందు వీటిని టీడీపీ ప్రకటించి ప్రజల్లోకి తీసుకెళ్లారు.


ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఉచితాలకు తాము వ్యతిరేకం అని చెప్పే బీజేపీ వీటిని ఏ మేరకు అంగీకరిస్తుందనేది ప్రధాన ప్రశ్న. మరోవైపు జనసేన కూడా వీటిపై మౌనంగానే ఉంది. తాజాగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ప్రజాకర్షక మ్యానిఫెస్టో ని సిద్ధం చేసే పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో కూటమిలో కీ రోల్ పోషిస్తున్న బీజేపీ ఉచితాలకు వ్యతిరేకంగా ఎవరికి వారు మ్యానిఫెస్టో విడుదల చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.


ఎవరికి వారు విడిగా ప్రకటిస్తే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది.  ఇది ఉమ్మడి మ్యానిఫెస్టోనా కాదా అని చంద్రబాబు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఈ పథకాలకు నిధులు ఎలా సమకూరుస్తారో కూడా ప్రజలకు చెప్పాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తాము అమలు చేస్తే శ్రీలంక అవుతుందని ఆందోళన చెందిన చంద్రబాబు మరి వాటికి మించి ఈ పథకాలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. రూ.83వేల కోట్లు సూపర్ సిక్స్ పథకాలకే నిధులు అవసరం అయితే మిగతా వాటి పరిస్థితి ఏంటి వీటిపై చంద్రబాబు పూర్తి స్పష్టత ఇవ్వాలని వారు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: