ఎన్నారై ఓటు బ్యాంకు టిడిపికి పదిలంగానే ఉందా? అంటే అవుననే మాటే వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఎన్నారైలు విస్తృతంగా పర్యటించారు. విస్తృతంగా ప్రచారం చేశారు. చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే వారు ముందుకు సాగారు. దీంతో అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, దుబాయ్ ల నుంచి కూడా వేలాది మంది ఎన్నారై నాయకులు వచ్చి టిడిపి జెండా పట్టుకుని నియోజకవర్గాల్లో వాడవాడలా తిరిగి చంద్రబాబును ఎందుకు సీఎం చేయాలో వివరించారు. ఫలితంగా గ్రామీణ స్థాయిలో పెద్ద కదలిక వచ్చింది.


టిడిపికి, కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు ఓటేశారు. ఇప్పుడు ఏడాది తర్వాత ఎన్నారైల పరిస్థితి ఎట్లా ఉంది, ఎన్ఆర్ఐలు ఏమని అంటున్నారు. అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొంతమంది ఎన్నారైలు చంద్రబాబును విమర్శిస్తున్నారని, కూటమి ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంట్లో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే.. నిజానికి ఎన్నారైలు కూడా కూటమిలో భాగస్వాములు అవుతున్నదాన్ని బట్టి పెద్దగా వ్యతిరేకత లేదనే చెప్పాలి.


పైకి ప్రచారం జరిగినంతగా ఎన్నారైలు కూటమి ప్రభుత్వంపై ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. పైగా ఏపీ ఎన్నార్టీ చైర్మ‌న్‌గా వేమూరి రవికుమార్ కి తాజాగా అవకాశం కల్పించడం పట్ల ఎన్నారై వర్గాలు సంతోషంగానే ఉన్నాయి. ఈ విషయంలో పెద్దగా ఎవరు స్పందించాల్సిన అవసరం లేదని సీనియర్ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఎన్నారైలు సానుకూలంగానే ఉన్నారనేది పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అయితే అమరావతిని పూర్తి చేయాలని, సాధ్యమైనంత వేగంగా ఇక్కడ నిర్మాణాలు సాధించాలని మాత్రం చాలా మంది ఎన్నారైలు కోరుకుంటున్నారు. తద్వారా అనేక కంపెనీలు రావడంతో పాటు విద్యాసంస్థల ద్వారా అభివృద్ధి తదితర సంక్షేమాన్ని కూడా అందించేందుకు అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు.


ఇక విశాఖపట్నం ఐటి కేంద్రంగా మార్చాలని కోరుకుంటున్న ఎన్నారైలు కూడా ఎక్కువమంది ఉన్నారు. అయితే కర్నూలుకు హైకోర్టు బెంచిని తరలించాలా వద్దా అనే అంశంపై మాత్రం ఎన్నారై నాయకులు కొంత విభేదిస్తున్న మాట వాస్తవమే. ఈ ఒక విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాలను ఎన్నారై నాయకులు గానీ ఎన్నారై కార్యకర్తలు గాని   ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయడం లేదనేది వాస్తవం. కానీ వారు ఏదో విమర్శలు చేస్తున్నారని కూటమి ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారని  ప్రచారం మాత్రం జరుగుతోంది. ఇది త‌ప్ప‌నేది టీడీపీ సీనియ‌ర్లు చెబుతున్న మాట‌.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: