కడప జిల్లా అంటేనే వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో వైసీపీకి తిరుగులేదని 2019 ఎన్నికలు రుజువు చేశాయి. ఇక జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో కూడా వైసీపీకి ఎదురులేదు. 2014లో ఇక్కడ వైసీపీ నుంచి ఆదినారాయణరెడ్డి విజయం సాధించి, తర్వాత టీడీపీలోకి జంప్ కొట్టి మంత్రి అయ్యారు. దీంతో 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు బరిలో సుధీర్ రెడ్డి బరిలో నిలిచారు.


సుధీర్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసిన రామసుబ్బారెడ్డిపై 50 వేల ఓట్ల పైనే మెజారిటీతో విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్ ప్రజలకు దగ్గరగానే ఉంటున్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా...వాటిని పరిష్కరించడానికి చూస్తున్నారు. తన ఇంటి వద్దకే ప్రజలని పిలిపించుకుని , సమస్యలు తెలుసుకుని, వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపిస్తున్నారు. ఇంకా నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో తాగునీరు సమస్యలు లేకుండా చూసుకుంటున్నారు.


ఇటు పార్టీ పరంగా కూడా చూసుకుంటే, జమ్మలమడుగులో వైఎస్సార్‌సీపీకి తిరుగులేదు. అసలు ఇక్కడ టీడీపీ అడ్రెస్ ఎప్పుడో గల్లంతైపోయింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీ మరీ ఘోరంగా ఓడిపోయింది. అలాగే జమ్మలమడుగులో టీడీపీకి సరైన నాయకత్వం లేదు. 2019 ఎన్నికలైపోయాక ఆదినారాయణ బీజేపీలోకి వెళ్లిపోతే, రామసుబ్బారెడ్డి వైఎస్సార్‌సీపీలోకి వెళ్లారు. దీంతో టీడీపీకి దిక్కు లేకుండా పోయింది.


ప్రస్తుతం పులివెందులతో పాటు జమ్మలమడుగు బాధ్యతని బీటెక్ రవి చూసుకుంటున్నారు. అయినా సరే జమ్మలమడుగులో టీడీపీ బలపడలేదు. ఇంకా పార్టీ వీక్ అవుతూనే వస్తుంది. అయితే సుధీర్ రెడ్డికి జగన్ ఇమేజ్ బాగా కలిసొస్తుంది. ఆయనకు భవిష్యత్‌లో ఓటమి రావడం కష్టమే అని తెలుస్తోంది.  వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ వైసీపీకి తప్పా, మరొక పార్టీకి ఛాన్స్ లేదు. కాబట్టి ఇక్కడ వైసీపీ జెండా దించడం ఎవరి వల్ల కాదు.



మరింత సమాచారం తెలుసుకోండి: