ఒక‌ప్పుడు బాలీవుడ్ సినిమాల‌కూ, అక్క‌డి హీరోల‌కూ మాత్ర‌మే దేశ‌మంత‌టా క్రేజ్ ఉండేది. మొద‌టి త‌రం స్టార్ హీరోలైన రాజ్ క‌పూర్‌, దేవానంద్, దిలీప్‌కుమార్ ల‌ హ‌యాంలో ద‌క్షిణాదిన కేవ‌లం ఉన్న‌త విద్యావంతులైన ప‌రిమిత‌ వ‌ర్గానికి మాత్ర‌మే తెలిసిన‌ హిందీ సినిమా, అమితాబ్ బ‌చ‌న్‌, ధ‌ర్మేంద్ర‌, జితేంద్ర మిధున్‌చ‌క్ర‌వ‌ర్తి, అనిల్‌క‌పూర్‌ త‌దిత‌ర హీరోలు రాజ్య‌మేలే స‌మ‌యానికి ద‌క్షిణాదిన కూడా మార్కెట్ సంపాదించుకుంది. ఇక ఖాన్‌త్ర‌యం హ‌వా మొద‌ల‌య్యాక వారి సినిమాలకు హిందీయ‌త‌ర భాషా ప్రాంతాల్లో కూడా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌నుంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ద‌క్షిణాది భాష‌ల్లోకి అనువాద‌మ‌య్యే ఈ హీరోల చిత్రాలు ఇక్క‌డి స్ట్రెయిట్ చిత్రాల‌తో పోటీప‌డే స్థాయిలో వ‌సూళ్లు అందుకోవ‌డం మొద‌లైంది. అదే స‌మ‌యంలో ద‌క్షిణాది సినిమాలన్నా, హీరోల‌న్నా ఉత్త‌రాదిన నిన్న మొన్న‌టిదాకా చిన్న‌చూపే. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ వంటి ద‌క్షిణాది సూప‌ర్‌స్టార్లు సైతం గ‌తంలో బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో న‌టించినా ఆశించినంత ఆద‌ర‌ణ ల‌భించ‌క ప్రాంతీయ భాషల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైపోయారు.  ఇక అక్క‌డి స్టార్ హీరోయిన్లు ద‌క్షిణాది హీరోల సినిమాల్లో న‌టించ‌డానికి ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించేవారు. లేదా రెట్టింపు రెమ్యూన‌రేష‌న్ అడిగేవారు.
 

             అయితే ఇప్పుడు ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ద‌క్షిణాది హీరోలు.. మ‌రీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలకు దేశం మొత్తం స‌లాం కొడుతోంది.  ఈ ట్రెండ్ కు బాహుబ‌లి ప్రభాస్ బీజం వేయ‌గా, తార‌క్‌, చెర్రీ, మ‌హేష్, బ‌న్నీ దీన్ని బ‌లంగా కొన‌సాగిస్తున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ ఈవెంట్ కోసం ముంబై వెళ్లిన రాంచ‌ర‌ణ్‌ను చూసి అక్క‌డి అభిమానులు చేసిన హ‌డావిడి, అత‌డికున్న క్రేజ్‌ చూసి బాలీవుడ్ జ‌నాల‌కు మ‌తిపోయింద‌ట‌. ఇక తార‌క్‌కు సైతం ఉత్త‌రాదిన విశేష సంఖ్య‌లో అభిమాన గ‌ణం ఉంది. ఇప్ప‌టిదాకా బాలీవుడ్ చిత్రాల్లో న‌టించేందుకు ఏమాత్రం ఆస‌క్తి చూప‌ని సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌కు, బ‌న్నీకి సైతం అక్క‌డ మార్కెట్ ఉంది. దీనికి కార‌ణం వీరి సినిమాలు హిందీలోకి అనువాద‌మై అక్క‌డి ప్రేక్ష‌కుల‌కు చేరువ కావ‌డ‌మే. ఇక మ‌హేష్‌కు కోలీవుడ్ లోనూ, బ‌న్నీకి మాలీవుడ్‌లోనూ అక్క‌డి హీరోల‌తో పోటీ ప‌డేంత మార్కెట్ ఇప్ప‌టికే ఉంది. ప్ర‌స్తుతం ప‌రిస్థితి చూస్తే ఒక‌ప్ప‌టి బాలీవుడ్ హీరోల స్థానాన్ని, ఇప్పుడు మ‌న‌ టాలీవుడ్ హీరోలు ఆక్ర‌మించార‌ని మ‌నం కాల‌ర్ ఎగ‌రేసి మ‌రీ చెప్ప‌వ‌చ్చ‌న్న‌మాట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: