టాలీవుడ్ కింగ్ నాగార్జున సోలోగా హిట్ అందుకుని చాలా కాలమే అయింది. క్లాస్ కైనా, మాస్ కైనా, భక్తికైనా, రక్తికైనా తానే బాస్ అని నిరూపించుకున్న నాగార్జున ప్రస్తుతం వరుస ఫ్లాపులతో తీవ్రంగా సతమతం అవుతున్నారు.
2016లో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నాగార్జున.. ఆ తర్వాత సక్సెస్ ముఖమే చూడలేదు.

ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘బంగార్రాజు’ చిత్రం మంచి విజయం సాధించింది. కానీ ఇది మల్టీస్టారర్. ఇందులో నాగార్జున కంటే ఆయన తనయుడు నాగ చైతన్యకే ఎక్కువ గుర్తింపు దక్కింది. దీంతో సోలోగా ఎలాగైనా హిట్ కొట్టాలని నాగార్జున ఇటీవల ‘ది ఘోస్ట్’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా దసరా పండుగ కానుకగా గ్రాండ్ రిలీజ్ అయింది. కానీ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. టాక్‌ అనుకూలంగా లేకపోవడం, బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం ఉండడంతో బాక్సాఫీస్ వద్ద ‘ది ఘోస్ట్’ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.

ఈ సినిమాతో నాగార్జునకు మరో ఫ్లాప్‌ ఖాయమైంది. ఈ నేపథ్యంలోనే పలువురు నెటిజన్లు నాగార్జున సోలోగా హిట్ కొట్టడం కష్టమేనని, ఇక ఆయన విక్టరీ వెంకటేష్ ను ఫాలో అయితే బెటరేమో అని సూచనలు చేస్తున్నారు. వెంకీ సోలోగా సినిమాలు చేయడం బాగా తగ్గించేశారు. ఈయన ఎక్కువగా మల్టీస్టారర్ చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తూ బ్యాక్ టు బ్యాక్‌ హిట్లను ఖాతాలో వేసుకుంటున్నారు.

రిస్క్ చేయడం కంటే మరో హీరో సపోర్ట్ ను తీసుకుని ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తూ వెంకీ సత్తా చాటుతున్నారు. దర్శక నిర్మాతలకు సైతం ఏదైనా మల్టీ స్టారర్ సబ్జెక్టు ఉందంటే ముందుగా వెంకీ మామ పేరే గుర్తుకు వస్తుంది. అంతలా మల్టీస్టారర్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచారు వెంకీ.

ఈ నేపథ్యంలోనే నాగార్జున సైతం వెంకీని ఫాలో అయితే మంచిదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సోలోగా రిస్క్ చేసే కంటే మరో హీరో సాయం తీసుకుని మల్టీస్టారర్ చిత్రాలు చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. ఈ విధంగా అయినా కెరీర్ కొన్నాళ్ల పాటు ముందుకు సాగుతుందని అంటున్నారు. మరి నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: