ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డిజిటల్‌ ఇమేజ్‌కు ప్రాణం పోస్తుంటాడు కలరిస్ట్‌ అలియాస్‌ డిజిటల్‌ లైట్‌మెన్‌. అలా అని, ఛత్రపతి మొదలు రాజమౌళి తీసిన ప్రతి సినిమాకూ కలరిస్ట్‌గా పనిచేసిన శివకుమార్‌ జీవితమేం పంచవర్ణాల చిత్రం కాదు.
Colourist | ఓ మినీ థియేటర్‌. పెద్ద తెర. ముందు మూడు సీట్లు. ఆ వెనకాలే తన సీజీ సామ్రాజ్యం. అక్కడే తిండి. ఆ కుర్చీనే పడక. డైరెక్టర్లు, కెమెరామెన్లు కళ్లార్పకుండా చూస్తూ.. ఏవైనా సూచనలు చెబుతారు. మళ్లీ కరెక్షన్‌ చెయ్యాలి. ఒక్కసారి సీట్లో కూర్చుంటే రోజులు గడిచిపోవచ్చు. అయినా, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డిజిటల్‌ ఇమేజ్‌కు ప్రాణం పోస్తుంటాడు కలరిస్ట్‌ అలియాస్‌ డిజిటల్‌ లైట్‌మెన్‌. అలా అని, ఛత్రపతి మొదలు రాజమౌళి తీసిన ప్రతి సినిమాకూ కలరిస్ట్‌గా పనిచేసిన శివకుమార్‌ జీవితమేం పంచవర్ణాల చిత్రం కాదు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా..

ఎన్టీఆర్‌ ఓపెనింగ్‌ సీన్‌.

తోడేలు కోసం రక్తం తలపై పోసుకోవడం దగ్గర్నుంచి.. అనుకోకుండా పెద్దపులికి చిక్కి.. దానిని బంధించే వరకూ సాగే ఉత్కంఠభరిత దృశ్యం. దాదాపు నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఆ ఘట్టానికి 'కలర్‌ గ్రేడింగ్‌’ చెయ్యడానికి నెలరోజులు పట్టింది. ఆ నెలలో తాను గడిపిన నిద్రలేని రాత్రుల గురించి కలరిస్ట్‌ బీవీఆర్‌ శివకుమార్‌కే తెలుసు. ఎందుకంటే.. రెప్పపాటులో పూర్తయిపోయే ప్రతీ ఫ్రేమ్‌కూ కరెక్షన్‌ చెయ్యాల్సిన బాధ్యత కలరిస్ట్‌దే. ఒక్కో ఫ్రేమ్‌ కొన్నిసార్లు 45 నిమిషాల వరకూ తీసుకోవచ్చు. దర్శకుడు రాజమౌళి తన సినిమాలకు సెంథిల్‌కుమార్‌నే డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ (డీఓపీ)గా నియమించుకుంటారు. సెంథిల్‌ ఆలోచనలకు తగ్గట్లుగా కలర్‌ గ్రేడింగ్‌ షాట్స్‌కు ప్రాణం పోస్తుంటారు శివకుమార్‌. 'ట్రిపుల్‌ ఆర్‌’ కోసం డీఓపీతో కలిసి ఎనిమిది నెలలు పనిచేశారు శివ. ఆ కృషి ఫలితంగానే ఇండియాలో టాప్‌-5 కలరిస్ట్‌లలో ఒకరిగా నిలిచారు శివకుమార్‌.
కలర్‌ కరెక్షన్‌ అంటే..?

గతంలో సినిమా రీల్స్‌లో ఉండేది. అప్పుడు 'ఆర్‌జీబీ' ఫార్మాట్‌లోనే ఫిల్మ్‌ నెగిటివ్‌ నుంచి కలర్‌ కరెక్షన్‌ చేసేవారు. కలర్స్‌ బ్రైట్‌నెస్‌ పెంచడం, తగ్గించడం తప్పితే చేయడానికి ఏమీ ఉండేది కాదు. ఈ 'అనలైజర్‌’ పనిని ల్యాబ్‌లో మాత్రమే చేస్తారు. ఇది డిజిటల్‌ కాలం. సీజీ షాట్స్‌కు, ఇమేజ్‌కు డిజిటల్‌గా కలర్‌ కరెక్షన్‌/గ్రేడింగ్‌ వంటివి చేయడాన్నే డీఐ (డిజిటల్‌ ఇంటర్మీడియెట్‌)గా వ్యవహరిస్తున్నారు. ఇందులో ప్రతీ ఫ్రేమ్‌లో.. ప్రతి పిక్సెల్‌కూ కరెక్షన్‌ సాధ్యమే. ప్రేక్షకుడి దృష్టికోణాన్ని అర్థం చేసుకొని కరెక్షన్‌ తగ్గించాలా, పెంచాలా అన్నది నిర్ణయిస్తారు.. సినిమా షూటింగ్‌లో కొన్నిసార్లు లైట్స్‌ పెట్టడం మర్చిపోతుంటారు. ఆ లోపాన్ని కూడా కలర్‌ కరెక్షన్‌, గ్రేడింగ్‌లో సరిచేయవచ్చు. అందుకే కలరిస్ట్‌ను 'డిజిటల్‌ లైట్‌మెన్‌’ అనీ పిలుస్తున్నారు. కథను బట్టి కలర్‌టోన్స్‌ను మార్చడం అన్నది అతిపెద్ద సవాలు. కథ.. థ్రిల్లర్‌, పీరియాడికల్‌, అడ్వెంచర్‌, రొమాన్స్‌.. ఏ నేపథ్యమైనా కావచ్చు. ప్రేక్షకుడికి చేరాలంటే డీఐ కచ్చితంగా వాడాల్సిందే.

300కు పైగా సినిమాలు..

శివకుమార్‌ దాదాపు మూడు వందల సినిమాలకు కలరిస్ట్‌గా పనిచేశారు. అతను పనిచేసిన తొలి ఐదు సినిమాలూ జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. ఛత్రపతి, అరుంధతి, మగధీర, ఈగ, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌.. దేనికదే ఆణిముత్యం. శివకుమార్‌ది కడప జిల్లా. మొదట్లో డీటీపీ నేర్చుకున్నారు. ఓ గ్రాఫిక్స్‌ దుకాణంలో నెలకు వెయ్యి రూపాయల జీతానికి పని చేసేవారు. తర్వాత ఓ దినపత్రికలో స్కానింగ్‌ ఆపరేటర్‌గా అవకాశం వచ్చింది. ప్రమోషన్‌ మీద బెంగళూరు వెళ్లి, అక్కడే మల్టీమీడియా నేర్చుకున్నారు. అక్కడితో ఆగకుండా మధురైలో డిజిటల్‌ ఆప్టికల్స్‌ వర్క్‌ నేర్చుకొని చెన్నై పయనమయ్యారు. మాధవన్‌ హీరోగా వచ్చిన 'ప్రియసఖి' ద్వారా తానేంటో నిరూపించుకున్నారు. టాప్‌ కెమెరామెన్‌ సేతు శ్రీరామ్‌తో 'శభాష్‌’ అనిపించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 'గజినీ' సినిమాకు ముంబై కలరిస్ట్‌లను తలదన్నే రీతిలో పనిచేశారు. సెంథిల్‌కుమార్‌ సినిమాటోగ్రఫీలో రూపొందిన 'ఛత్రపతి'తో శివ కెరీర్‌ మలుపు తిరిగింది. సెంథిల్‌ స్వయంగా తీసుకెళ్లి రాజమౌళికి పరిచయం చేశారు. అంతే, 13 ఏండ్ల చెన్నై ప్రయాణానికి స్వస్తి చెప్పి హైదరాబాద్‌కు వచ్చేశారు శివకుమార్‌.

ఓ యువకుడి కథ ..

శివకుమార్‌కు డైరెక్టర్‌ రాజమౌళి దర్శకత్వ విధానమంటే చాలా ఇష్టం. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని 'గురుకులం' పేరుతో ఓ షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించారు. తన జీవితంలోజరిగిన సంఘటనలు మేళవించి దీన్నో స్ఫూర్తిదాయక కథగా తీర్చిదిద్దారు. 'టెన్త్‌ ఫెయిల్‌, ఇంటర్‌, డిగ్రీలు కాపీ కొట్టి పాసైనా.. అవేవీ తనకు ఉపయోగపడలేదు. తనలోని ప్రతిభను తెలుసుకుని… ఓ స్థాయికి వచ్చిన ఓ యువకుడి కథే గురుకులం' అంటారు శివకుమార్‌.

– రవికుమార్‌ తోటపల్లి

మరింత సమాచారం తెలుసుకోండి: