తెర మీదే కాదు.. తెర వెనుక కూడా సినిమాలను మించిన కథ ఉన్న నటీనటులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో అందరికన్నా ముందున్న వ్యక్తి సంజయ్ దత్. ఈ స్టార్ హీరో జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. కెరీర్ స్టార్టింగ్ లోనే డ్రగ్స్‌కు బానిసైన సంజూ, తరువాత జైలు పాలు కావటం, తిరిగి వచ్చి సినిమాల్లో స్టార్‌గా ఎదగటం లాంటి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.
తాజాగా యాసర్ ఉస్మాన్ సంజయ్ దత్ బయోగ్రఫీపై ఓ పుస్తకాన్ని రాశాడు. సంజయ్ దత్ : ద క్రేజీ అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ బాలీవుడ్స్ బ్యాడ్ బ్యాయ్ పేరుతో రాసి ఈ పుస్తకంలో సంజయ్ జీవితంలోని చీకటి కోణాలు, తల్లి నర్గీస్ దత్తో ఆయన బంధం గురించి లోతుగా విశ్లేషించాడు. అంతేకాదు కెరీర్ తొలి నాళ్లలో సంజయ్ ఎలా మాదక ద్రవ్యాలకు బానిస అయ్యాడో కూడా వివరించాడు. అంతేకాదు యాసర్ రాసిన ఈ పుస్తకం ప్రకారం సంజయ్ దత్ డ్రగ్ అడిక్ట్ అని నమ్మేందుకు ఆయన తల్లి అంగీరించలేదట. అంతేకాదు సంజయ్ గే అయ్యుంటాడని కూడా ఆమె అనుమానించిందని వెల్లడించాడు.
నర్గీస్ దత్ విషయానికి వస్తే ఒక దశలో ఆమె బాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సునీల్ దత్‌ను వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. యాసర్ రాసిన పుస్తకం ప్రకారం నర్గీస్ దత్ తన పిల్లలను ఎంతో గారభం చేసేదట. ముఖ్యంగా పెద్ద కొడుకైన సంజయ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టమని అతన్ని ఎంతగానో పాంపర్ చేసేదని వెల్లడించాడు.
ఆ అతి ప్రేమ కారణంగానే డ్రగ్ ఎడిక్ట్ అయిన సంజయ్‌లో వస్తున్ మార్పులను ఆమె గమనించలేకపోయిందని తెలిపాడు. అడపాదడపా కొన్ని లక్షణాలు కనిపించినా ఆమె ప్రేమ కారణంగా వాటిని గుర్తించలేకపోయిందని వెల్లడించాడు యాసర్.