
తమ బ్యానర్ స్థాపించి.. 50 ఏళ్లవుతున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్ పెద్దలు ఓ ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియా వేదిక ట్విటర్ ద్వారా వెల్లడించారు. తాము సంగీత పరిశ్రమలోకి కూడా త్వరలో అడుగుపెడుతన్నట్లు వెల్లడించారు. SP మ్యూజిక్ పేర తమ సంగీత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
సినీ రంగంలోలాగే సంగీత రంగంలో కూడా తాము ముందుండాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. తెలుగు సంగీత రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు తమ శాయ శక్తులా కృషి చేస్తామని వెల్లడించారు. SP మ్యూజిక్కు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయని త్వరలోనే తమ ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయని ప్రకటించారు. రామానాయుడు కాలం చేసిన తర్వాత ఆయన పెద్ద కుమారుడు, విక్టరీ వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు ఈ ప్రొడక్షన్ ను చూసుకుంటున్నారు.
కేవలం తెలుగులోనే కాకుండా దాదాపు అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించిన చరిత్ర సురేష్ ప్రొడక్షన్స్ది. సినిమాలు నిర్మించడమే కాకుండా వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే బాధ్యతలను కూడా సురేష్ ప్రొడక్షన్స్ విజయవంతంగా నిర్వహించింది. తాజాగా సంగీత రంగంలోకి కాలుపెడుతున్న సురేష్ ప్రొడక్షన్స్ కి అన్నీ విజయాలే కలగాలని కోరుకుందాం.