ఆదిపురుష్ టీజర్ విడుదల అయినప్పటి నుంచి విమర్శల్ని మూటగట్టుకోవడంతో పాటు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉందట.


ఓవైపు వీఎఫ్ఎక్స్ బాగోలేదని ఫ్యాన్స్ మండిపడుతుంటే.. మరోవైపు హనుమంతుడు, రావణ పాత్రలను చూపించిన విధానంపై హిందూ సంఘాలు సహా బీజేపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట.. మరీ ముఖ్యంగా.. సైఫ్ అలీ ఖాన్ ఈ టీజర్‌లో రావణుడు కంటే అలావుద్దీన్ ఖిల్జీగా ఎక్కువగా కనిపిస్తున్నాడంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రావణాసురుడు పాత్రపై వస్తోన్న ట్రోల్స్ మీద డైరెక్టర్ ఓమ్ రౌత్ తాజాగా వివరణ ఇచ్చాడు.


''రావణాసురుడు క్రూరత్వం కలిగిన వ్యక్తి కాబట్టి.. ఆయన క్రూరత్వాన్ని లుక్‌తోనే చూపించాలి. గతంలో రావణుడ్ని పొడవాటి జుట్టు, గంభీరమైన చూపులు, భారీ ఆకారంతో చూపించేవారు. ఆ రోజుల్లో క్రూరత్వాన్ని ఆ విధంగా చూపించారు. కానీ.. నేను ఇప్పటితరంతో పాటు భవిష్యత్తు తరాల వారికి ఈ సినిమా చేరాలని కోరుకుంటున్నానని. ఈ సినిమాతో రాముడి గొప్పతనాన్ని రానున్న తరాలకు తెలియజేయాలని అనుకుంటున్నానని అందుకే.. ట్రెండ్‌కి తగినట్టుగా రావణుడి లుక్‌ని అలా డిజైన్ చేశాం. అంతే తప్ప ఏదో రామాయణాన్ని వక్రీకరించాలన్న ఉద్దేశంతో అలా చేయలేదు'' అంటూ డైరెక్టర్ ఓమ్ రౌత్ చెప్పుకొచ్చాడు. అలాగే.. గ్రాఫిక్స్‌పై వస్తోన్న విమర్శల మీద కూడా స్పందించాడట.


''టీజర్‌లో రావణుడు ఒక భయంకరమైన పక్షిపై కూర్చున్నట్టు చూపించాం. అయితే, దాని మీద విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు. కేవలం 95 సెకన్ల వీడియో చూసి, ఒక అభిప్రాయానికి రావొద్దు. థియేటర్లలో ఈ సినిమాని చూశాక, అప్పుడు మాట్లాడండి'' అని చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో హనుమంతుడికి లెదర్ దుస్తులు వేశారన్న వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతూ.. తాము సినిమాలో లెదర్ దుస్తులు ఉపయోగించలేదని, మమ్మల్ని నమ్మండని విజ్ఞప్తి కూడా చేశాడు. కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కానుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: