
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లను హీరోలుగా పెట్టి దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ` ఆర్ఆర్ఆర్ ` చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో, ఎన్ని రికార్డులను తిరగరాసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత్ కు ఎన్నో ఏళ్ల నుంచి కలగానే మిగిలిపోయిన ఆస్కార్ ను కూడా ఆర్ఆర్ఆర్ సాకారం చేసింది. ఈ సినిమాలోని ` నాటు నాటు ` పాట అవార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొట్టింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా ఆస్కార్ ను సొంతం చేసుకుంది.
అటువంటి నాటు నాటు పాట మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ కలిసి డ్యాన్స్ చేస్తే చూడాలని ఉందంటూ ఎన్టీఆర్ తన మనసులో ఉన్న క్రేజీ కోరికను బయటపెట్టారు. తాజాగా లండన్‌లోని చారిత్రాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి ఒకే వేదికపై సందడి చేశారు. ఈ కార్యక్రమంలో చరణ్, ఎన్టీఆర్ అనుబంధం చూసి అభిమానులు మురిసిపోయారు. ఇద్దరు హీరోలు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం, ఎన్టీఆర్ కు చరణ్ ముద్దు పెట్టడం హైలెట్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా వేదికపై ఎన్టీఆర్ ` నాటు నాటు ` పాటు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ` నాటు నాటులో నా క్లోజ్ ఫ్రెండ్ చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అయితే చరణ్ వాళ్ల ఫాదర్ చిరంజీవి గారు ఎంత గొప్ప డ్యాన్సరో మనందరికి తెలుసు. అలాగే మా బాబాయ్ బాలకృష్ణ గారు కూడా మంచి డ్యాన్సర్. వీరిద్దరు కలిసి నాటు నాటుకి డ్యాన్స్ చేస్తే నిజంగా అది ఒక మంచి జ్ఞాపకంగా చరిత్రలో మిగిలిపోతుంది ` అంటూ ఎన్టీఆర్ తన మనసులో కోరికను బయటపెట్టగానే ఫ్యాన్స్ అరుపులు కేకలతో మరింత హుషారు పెంచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు