
అయితే ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో `నువ్వు ఏం కావాలనుకుంటున్నావ్ వెంకీ` అని పింకీ అడగ్గానే.. వెంకటేష్ `ఊహ తెలిసిన దగ్గర నుంచి నేనొక కల కనేవాడిని. చిన్న కల. నేను ఐఏఎస్ పాసై వైజాగ్ కలెక్టర్ ఆఫీస్‌లో కలెక్టర్ చైర్ లో కూర్చుని చంద్రబాబు గారితో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉండగా, మా నాన్న నాకోసం వచ్చి అటెండర్ నేను బిజీగా ఉన్నానని చెబితే.. వరండాలో బెంచి మీద కూర్చుని వెయిట్ చేస్తూ కిటికీలో నుంచి నన్ను చూసి మురిసిపోతుంటే, ఆ చూపులు నన్ను తడిమి ఎందుకో కిటికీ వైపు చూస్తే మా నాన్న నాకు కనిపిస్తాడు. వెంటనే నేను చంద్రబాబుకు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడని చెప్పేసి టీవీ కట్టేసి పరుగెత్తుకుంటూ బయటికి వస్తాను..` అంటూ ఎమోషనల్ గా ఓ కట్టు కథ చెబుతాడు.
సినిమాలో ఈ సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ముఖ్యంగా వెంకీ స్టోరీ చెప్పాక.. కమెడియన్ సునీల్ `ఏదో ఒక రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు` అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ డైలాగ్ చెప్పడం వేరె లెవల్. అయితే వెంకీ చెప్పిన ఈ కట్టు కథను శివ అనే ఓ నెటిజన్ ఏఐ రూపంలో నిజం చేసి చూపించాడు. వెంకీ కల కనడం, కలెక్టర్ అవడం, చంద్రబాబుతో మీటింగ్.. ఇలా ప్రతి సీన్‌ను చాలా డీటైలింగ్ గా ఏఐ సహాయంతో వీడియో క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఏఐ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుకుంటున్నారు. సదరు నెటిజన్ ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ కామెట్లు చేస్తున్నారు.