సహజ నటి జయసుధ గురించి పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జయసుధ.. ప్రస్తుతం సహాయక నటిగా రాణిస్తున్నారు. ప్రొఫెషన్ గురించి పక్కన పెడితే.. జయసుధ పర్సనల్ లైఫ్ లో ఓ అంతులేని విషాదం ఉంది. అదే భర్త ఆత్మహత్య. బాలీవుడ్ నిర్మాత అయిన జయసుధ భర్త నితిన్ కపూర్ 2017లో ముంబైలోని తన కార్యాలయంపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. అప్పటికి ఆయన వయసు 58 ఏళ్ళు. భర్త మరణం జయసుధ తీవ్రంగా కృంగితీసింది. ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఆమె చాలా సమయమే తీసుకుంది.


అయితే నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకోవడానికి అప్పులే కారణమ‌ని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ గ‌తంలో ఈ ప్ర‌చారాన్ని జ‌య‌సుధ ఖండించారు. తాజాగా తండ్రి మరణం వెనుక ఉన్న రహస్యాన్ని జయసుధ  కుమారుడు, న‌టుడు నిహార్ కపూర్ వివ‌రించారు. ఇటీవ‌ల `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన నిహార్ క‌పూర్‌.. ఓ ఇంట‌ర్వ్యూలో తండ్రి నితిన్ కపూర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.



`చిన్న వయసులోనే నాన్నకు డయాబెటిస్ వచ్చింది. అందువ‌ల్ల‌ ఫిట్నెస్ పై చాలా కేర్ తీసుకునేవారు. డైలీ జిమ్ కి వెళ్లేవారు. అయితే నాన్న నిర్మాతగా ఆరు సినిమాలు తీశారు. అందులో కొన్ని ఫెయిల్ అయ్యాయి. ఫెయిల్యూర్స్ ఆయ‌న‌ తీసుకోలేకపోయారు. పైగా కొత్తగా మ‌రే ప్రాజెక్ట్‌ ప్రారంభించిన మధ్యలోనే ఆగిపోయేవి. ఒక సినిమాను బాలీవుడ్ నిర్మాత తన్నుకుపోయారు. ఇలా చాలా విషయాలు ఆయన్ను డిస్టర్బ్ చేశాయి. దాంతో ఆయన డిప్రెషన్ కు లోనయ్యారు.



ఏళ్ల తరబడి డిప్రెష‌న్‌లోనే ఉన్నారు. నావల్ల నా చుట్టూ వాళ్ళు బాధపడుతున్నారు, వారి జీవితాల‌ను నేను నాశనం చేస్తున్నాను వంటి ఆలోచనలు ఆయన్ను తీవ్రంగా క‌ల‌వ‌ర పెట్టారు. నేను చనిపోతానని ఆయన పదేళ్లుగా చెబుతూనే వచ్చారు. ఒకరోజు అన్నంత ప‌ని చేశారు. నాన్న మరణం నుంచి కోలుకోవడానికి అమ్మకు చాలా సమయం పట్టింది` అంటూ నిహార్ క‌పూర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: