
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టైసన్ నాయుడు సినిమా ఇప్పటికీ విడుదలవ్వలేదు. గత ఏడాది విడుదలైన టీజర్‌కి మంచి స్పందన రాగా, వెంటనే సినిమా రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పటకీ ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ కె. చంద్ర తెరకెక్కిస్తున్నారు. నాలుగేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమా ఇప్పటివరకు పూర్తిగా పూర్తి కాకపోవడం వెనుక పలు కారణాలున్నాయి. అందులో ముఖ్యంగా బడ్జెట్, మార్కెట్ పరిస్థితులు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుండగా, అదే సంస్థ అఖండ 2 నిర్మాణంలోనూ ఉందనే విషయం ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై బాగా ప్రభావం చూపుతోంది. టాలీవుడ్ ఇన్‌సైడ్ టాక్ ప్రకారం టైసన్ నాయుడు ప్రాజెక్టును అఖండ 2 సినిమా మీదే బేస్ చేసి మార్కెట్‌లోకి తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు.
బాలకృష్ణ నటిస్తున్న అఖండ సీక్వెల్‌కి విపరీతమైన బజ్ ఉండటం, బిజినెస్ పరంగా మంచి అడ్వాంటేజ్ కావడం వల్ల, ఈ రెండు సినిమాల్ని ఒక ప్యాకేజీగా డీల్స్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం. సాయిశ్రీనివాస్ ఇటీవల భైరవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. సెప్టెంబర్ మూడో వారంలో మరో సినిమా కిష్కిందపురి కూడా విడుదలకు రెడీగా ఉండగా, టైసన్ నాయుడు మాత్రం ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి. గతంలో సాయిశ్రీనివాస్ చేసిన ఛత్రపతి హిందీ రీమేక్ తీవ్రంగా విఫలమైన తర్వాత, అతని థియేటర్ మార్కెట్‌పై కూడా కొన్ని నెగటివ్ షేడ్స్ వచ్చాయి.
ఇవన్నీ కలిపి చూసుకుంటే టైసన్ నాయుడుకి ప్రమోషన్ చాలా కీలకమవుతోంది. ఈ సినిమాలో సాయిశ్రీనివాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. కథ పరంగా కొత్త కోణంతో, యాక్షన్ నేపథ్యంతో రూపొందించారని టాక్. నభ నటేష్ కథానాయికగా నటిస్తుండగా, సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ కూడా హైలైట్ కానుంది. దర్శకుడు సాగర్ కె. చంద్ర ఈ సినిమాపైనే నాలుగేళ్లుగా పని చేస్తున్నారంటే, ఆయన పెట్టిన శ్రమ అర్థమవుతుంది. యూనిట్ వర్గాల సమాచారం మేరకు ఈ ఏడాదిలోనే సినిమాను రిలీజ్ చేయాలనే గట్టి ప్రయత్నాలు కొనసాగుతున్నాయట.