టాలీవుడ్‌లో ఈ యేడాది ఇప్ప‌టికే 8 నెల‌లు పూర్త‌య్యాయి. సెప్టెంబ‌రులో అడుగు పెట్టేశాం. ఈ నెల బాక్సాఫీసుకు చాలా కీల‌కం. ఎందుకంటే సెప్టెంబ‌రులో ముఖ్య‌మైన సినిమాలు బాక్సాఫీసు ముందుకు వ‌స్తున్నాయి. అందులో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న ఓజీ ఒక‌టి. ఈ వారం మూడు సినిమాలు రిలీజ్‌కు సిద్ధ‌మ‌య్యాయి. క్రిష్ ‘ఘాటీ’ ఒక‌టైతే.. మురుగ‌దాస్ ‘మ‌ద‌రాసీ’ మ‌రోటి. వీటితో పాటుగా ఈటీవీ విన్ రూపొందించిన ‘లిటిల్ హార్ట్స్’ అనే ఓ చిన్న సినిమా కూడా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి.సెన్సిబుల్ క‌థ‌ల‌తో ఆక‌ట్టుకొనే ద‌ర్శ‌కుడు క్రిష్. ఆయ‌న ఈసారి అనుష్క‌ని `ఘాటీ`గా చూపించ‌బోతున్నారు. అనుష్క వెండి తెర‌పై క‌నిపించి చాలా కాలం అయ్యింది. ఆమెకంటూ సెప‌రేట్ ఫ్యాన్ బేస్ వుంది. పైగా టీజ‌ర్, ట్రైల‌ర్ లో చూపించిన యాక్ష‌న్ అదిరింది. అనుష్క‌ని ఇలా చూడ‌డం, క్రిష్ ఈ త‌ర‌హా సినిమాలు చేయ‌డం పూర్తిగా కొత్త‌. కాబ‌ట్టి ‘ఘాటీ’పై ప్రేక్ష‌కులు గ‌ట్టిగా దృష్టి పెట్టే అవ‌కాశం ఉంది.


అనుష్క ప్ర‌మోష‌న్ల‌కు రాక‌పోవ‌డం మైన‌స్సే అయినా.. చిత్ర‌బృందం అవేం ప‌ట్టించుకోవ‌డం లేదు. పోస్ట‌ర్ పై అనుష్క క‌నిపిస్తే చాలు.. ప్ర‌చారం చేయాల్సిన ప‌ని లేదు అంటున్నాయి. అప్పుడెప్పుడో ద‌శాబ్ద‌కాలం క్రింద‌ట అనుష్క - క్రిష్ కాంబినేష‌న్లో వ‌చ్చిన వేదం సినిమా త‌ర్వాత మ‌రోసారి వీళ్లిద్ద‌రు ఘాటీ సినిమా కోసం క‌లిపి ప‌ని చేస్తున్నారు. ఇక కోలీవుడ్ క్రేజీ ద‌ర్శ‌కుడు ఏఆర్‌. మురుగ‌దాస్ సినిమాలంటే ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి. ఎందుకంటే ఆయ‌న ట్రాక్ రికార్డ్ అలాంటిది. కానీ ఈమ‌ధ్య మురుగ‌దాస్ నుంచి స‌రైన హిట్ రాలేదు. ఆ బాధ్య‌త… శివ కార్తికేయ‌న్ పై ప‌డింది. ఇద్ద‌రూ చేసిన ‘మ‌ద‌రాసీ’ ఈవార‌మే వ‌స్తోంది. ట్రైల‌ర్ ప్రామిసింగ్ గానే క‌నిపిస్తోంది. ఈసారి మురుగ‌దాస్ హిట్ కొట్టాల్సిన అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌లో ఉన్నాడు. మ‌రోవైపు శివ కార్తికేయ‌న్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. శివ కార్తికేయ‌న్ ల‌క్.. ఈ సినిమాకు క‌లిసొస్తే మురుగ‌దాస్ ఖాతాలో హిట్ ప‌డిన‌ట్టే.


ఈ రెండు సినిమాల‌తో ‘లిటిట్ హార్ట్స్’ అనే ఓ చిన్న సినిమా పోటీ ప‌డ‌బోతోంది. ఈటీవీ విన్ రూపొందించిన ఈ చిత్రం ఓ టీనేజ్ ల‌వ్ స్టోరీ. మౌళి క‌థానాయ‌కుడిగా న‌టించాడు. ట్రైల‌ర్ చాలా ఫ‌న్నీగా వుంది. నిజానికి ఓటీటీ కోస‌మే తీసిన సినిమా ఇది. అవుట్ పుట్ చూశాక‌… థియేట‌ర్ లో విడుద‌ల చేయాల‌ని ఫిక్స‌య్యారు. ఈ సినిమా కంటెంట్ పై వాళ్ల‌కంత న‌మ్మ‌కం ఏర్ప‌డింది. స‌ర‌దాగా టైమ్ పాస్ చేయ‌డానికి ఈ సినిమా ఓ మంచి ఆప్ష‌న్ గా క‌నిపిస్తోంది. మ‌రి ఈ మూడు సినిమాల వేటిక‌వే భిన్నంగా ఉన్నాయి. వీటిల్లో ఏ సినిమా ఈ వారం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పై చేయి సాధిస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: