టాలీవుడ్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే సీజన్ అంటే సంక్రాంతి. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల హంగామా, కుటుంబాలంతా థియేటర్లకు వెళ్లే వాతావరణం.. ఇవన్నీ కలిసొచ్చే టైమ్ ఇది. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమానే దీనికి పెద్ద ఉదాహరణ. ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టడం చిన్న విషయం కాదు. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకోవడమే దానికి కారణం. కానీ అదే సమయంలో గేమ్ చేంజర్, డాకు మహారాజ్ లాంటి సీరియస్ సినిమాలు నిలబడలేకపోయాయి. ఈసారి ఆ తప్పును రిపీట్ చేయకుండా, ఎంటర్టైన్మెంట్‌తో నిండిన సినిమాలనే సంక్రాంతి బరిలోకి దింపుతున్నారు.

మొదటగా, ‘మన శంకర వరప్రసాద్’. టైటిల్ వింటేనే జనం ఉత్సాహంగా ఉన్నారు. దానికి తోడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన సినిమాల్లో కామెడీ అన్నది హార్ట్ & సోల్. చిరంజీవితో చేస్తున్న ఈ సినిమా కూడా వినోదమే ప్రధాన ఆకర్షణగా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. టీజర్ ఇంకా రాకపోయినా.. వచ్చేసరికి పక్కా కామెడీ రాయట్‌గా ప్రెజెంట్ చేయబోతారని ఫ్యాన్స్ నమ్మకం. యాక్షన్ మిశ్రమం ఉన్నా.. చివరికి ప్రేక్షకులు నవ్వుతూనే బయటకు రావడం గ్యారెంటీ. అలాగే, నవీన్ పొలిశెట్టి కూడా తన స్టైల్లో రెడీ అవుతున్నాడు. ఆయన సినిమా ‘అనగనగా ఒక రాజు’ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ అని ప్రోమోలు ఇప్పటికే చెప్పేశాయి. ప్రమోషనల్ వీడియోల్లోనే ఫన్ పంచ్‌లు వేసి క్రేజ్ పెంచుతున్నారు. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌లను ఒకే సారి టార్గెట్ చేసేలా సినిమా కంటెంట్ రెడీ చేస్తున్నారని టాక్.

ఇక లేటెస్ట్‌గా రేసులోకి దూసుకొచ్చిన ప్రభాస్ సినిమా ‘రాజా సాబ్’. ఈ పేరు వింటేనే ఫ్యాన్స్‌లో జోష్ మామూలుగా లేదు. మరి దీనికి దర్శకత్వం వహిస్తున్నది మారుతి కావడంతో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. హార్రర్ కామెడీ జానర్‌లో ఆయన ఎప్పుడూ హిట్ కొడుతూనే ఉన్నారు. ఈసారి ప్రభాస్‌తో కలిసి అదే మంత్రం రిపీట్ చేయబోతున్నట్టు అనిపిస్తోంది. ట్రేడ్ టాక్ ప్రకారం, ప్రభాస్ చాన్నాళ్ల తర్వాత కామెడీ మోడ్‌లో కనిపించబోతున్నాడని.. ఆ కొత్త అవతారం చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అంతిమంగా చూసుకుంటే.. వచ్చే సంక్రాంతి రేసులో ఉన్న మూడు సినిమాలు – చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, ప్రభాస్ ‘రాజా సాబ్’ – అన్నీ వినోద ప్రధానంగా సాగేలా ఉండడం పక్కా. అందువల్ల వచ్చే పండగలో ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకుంటూ థియేటర్లలో హంగామా చేయడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: