
2014లో దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచి, నేరుగా మంత్రి పదవి దక్కించుకున్నారు. కానీ 2019లో వైసీపీ గెలుపుతో పాటు, తన వ్యాపార ప్రయోజనాల కోసం ఆ పార్టీకి జంప్ అయ్యారు. అయితే వైసీపీలో ఆయనకు ఆశించిన పదవులు దక్కలేదు. 2024 ఎన్నికల్లో దర్శి నుంచి టికెట్ అడిగినా, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. తర్వాత ఒంగోలు ఎంపీగా పోటీ చేయమని సూచించినా ఆయన అంగీకరించలేదు. చివరికి ఎన్నికల తరువాత శిద్ధా ఫ్యామిలీ వైసీపీని వదిలేశారు. ఆనాటి నుంచి శిద్ధా రాఘవరావు కుటుంబం తిరిగి టీడీపీలో చేరాలని చూస్తోంది. గత ఏడాది వరదల సమయంలో భారీ విరాళం ఇచ్చి బాబుని కలిసిన తర్వాత, ఆయన రీ-ఎంట్రీ ఖాయం అని అనుకున్నారు. కానీ ఏడాది గడిచినా ఆ పిలుపు మాత్రం రాలేదు. కారణం – నెల్లూరు జిల్లాలోనే ఒక కీలక నేత ఆయన రీ-ఎంట్రీకి వ్యతిరేకంగా ఉన్నారని టాక్. అంతేకాదు, పార్టీ హైకమాండ్ కూడా ఆయన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచింది.
ఇక దీనికి అసలు కారణం ఏమిటి? పార్టీ విశ్లేషకులు చెబుతున్నదేమిటంటే, కష్టకాలంలో టీడీపీని వదిలి వైసీపీలో చేరిన వారిని ఇప్పుడు అంతగా పట్టించుకోవడం లేదట. ఐదు సంవత్సరాలు విపక్షంలో ఉండి, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే బాబు, లోకేష్ ముందుకు సాగుతున్నారు. ఆ లైన్‌లో చూస్తే శిద్ధా రాఘవరావు రీ-ఎంట్రీ కష్టమేనని అంటున్నారు. ఏదేమైనా.. 2014లో జంప్ చేసి మంత్రిగా ఎదిగిన శిద్ధా రాఘవరావు, ఇప్పుడు అదే జంప్ వల్ల అవకాశాలను కోల్పోతున్నారనే చర్చ నెలకొంది. ఇక ఆయన రాజకీయ భవిష్యత్తు ఎటు దారితీస్తుందో చూడాలి. “జంపింగులు ఇచ్చిన లాభం.. ఇప్పుడు అదే అడ్డంకిగా మారిందా?” – శిద్ధా రాఘవరావు కేసు ఇప్పుడు ఆ ప్రశ్నకు ఉదాహరణగా నిలుస్తోంది.