రాజకీయాల్లో ఒక సామెత తరచుగా వినిపిస్తుంది – ఆడవారి మాటలకు అర్ధాలే వేరని. కానీ అదే మాటను కాస్త మార్చి చదివితే రాజకీయ నాయకుల మాటలకు కూడా అర్ధాలు వేరు అన్నట్టే ఉంటుంది. పరిస్థితిని బట్టి, పదవుల సమీకరణలను బట్టి వారి వ్యాఖ్యలకు విభిన్న అర్ధాలు రానివ్వాలి. ప్రస్తుతం ఆ పరిస్థితినే ఎదుర్కొంటున్న నేతల్లో ఒక‌రు మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి ప్రవేశించినప్పటికీ, ఆయనలో అసంతృప్తి మాత్రం మెల్లగా పెరుగుతూనే ఉంది. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయనకు రాజకీయ ప్రయాణం అంత సాదారణం కాదు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు అత్యంత సన్నిహితుడిగా ఉండి, బీజేపీలో చేరిన తర్వాత కూడా పెద్ద అవకాశాలు వస్తాయని ఆశించారు. కానీ కేంద్రంలో మంత్రిత్వం దక్కలేదు, మరోసారి రాజ్యసభ సీటు కూడా దక్కలేదు. చివరికి 2024 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ కోసం ఎదురు చూశారుగానీ, ఆయనకు విజయవాడ పశ్చిమ అసెంబ్లీ టికెట్ మాత్రమే దక్కింది.

గెలిచి ఎమ్మెల్యేగా నిలిచినా అక్కడితో ఆయన జర్నీ ఆగిపోయింది. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ అసంతృప్తిని బహిర్గతం చేశాయనే టాక్ వినిపిస్తోంది. అమరావతి రైతుల సమస్యలపై తనదైన శైలిలో మాట్లాడిన సుజనా, రుషికొండ భవనాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. వైసీపీ పాలనగానే ఇప్పుడు కూటమి పాలన కనిపిస్తోంది అని చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వానికి ఇబ్బందే కలిగిందని అంటున్నారు. అసలైన అసహనం మాత్రం పదవుల పంచాయతీ మీదేనని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు మంత్రిత్వం దక్కే పరిస్థితి లేదు. సామాజిక సమీకరణల కారణంగా ఆయనను కేబినెట్‌లోకి తీసుకోవడం కష్టం. ఇక ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం కూడా ఆయన పేరే వినిపించిందని, చివరికి అది మాధవ్‌కు దక్కిపోవడంతో ఆయన నిరాశ చెందారన్న టాక్ ఉంది.

దీంతో ఆయనకు ఇప్పుడు ఉన్నది కేవలం ఎమ్మెల్యే పదవి మాత్రమే. ఇది ఆయన స్థాయికి సరిపోదని అనుచరులు గుసగుసలాడుతున్నారు. అందుకే అసెంబ్లీ సమావేశాల్లో తనలోని అసహనాన్ని వ్యాఖ్యల రూపంలో బయటపెట్టారని అంటున్నారు. ఈ టెర్మ్ ఇంతేనన్న భావనతోనే సుజనా రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు అని పలువురు అంటున్నారు. ఏదేమైనా.. సుజనా చౌదరి భవిష్యత్‌లో ఏ దిశగా అడుగులు వేస్తారో చూడాలి. ఈసారి మంత్రివర్గంలో అవకాశం దక్కకపోయినా, రాబోయే కాలంలో ఆయనకు పెద్ద స్థానం లభిస్తుందా లేదా అన్నది తెలుగుదేశం–బీజేపీ కూటమి రాజకీయాల్లో కీలక ప్రశ్నగా మారింది. “ఎమ్మెల్యేగా గెలిచినా, పదవులు దక్కకపోవడం సుజనా అసహనానికి కారణమా?” – ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధాన చర్చ!

మరింత సమాచారం తెలుసుకోండి: