కాశ్మీర్‌లో భారత సైన్యంపై ఉగ్రవాదులు మరోసారి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. సోమవారం ఉదయం దక్షిణ కశ్మీర్‌లోని పాంపోర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) పెట్రోలింగ్ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్టు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు గాయపడగా.. వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు జవాన్లు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారన్నారు. ఉగ్రవాదుల దాడితో పాంపోర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఇటీవల కాలంలో జ‌మ్మూ క‌శ్మీర్‌లో మారణ హోమానికి ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలను సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. ఆర్టికల్ 370 రద్దుతో ఆక్రోశంతో రగిలిపోతున్న దాయాది.. కశ్మీర్‌లో విధ్వంసానికి ఉగ్రవాదులను ఉసి గొలుపుతుంది. ఈ కుట్రలను తిప్పికొట్టే క్రమంలో పలువురు సైనికులు అమరలవుతున్నారు. పది రోజుల కిందట ద‌క్షిణ క‌శ్మీర్‌లోని షోపియాన్‌లో మినీ సెక్ర‌టేరియ‌ట్ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ గ‌స్తీ బృందంపై ఉగ్ర‌వాదులు దాడిచేశారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన జ‌వాన్లు ఉగ్రవాదుల చర్యను తిప్పికొట్టారు. అంతకు ముందు రోజు బుద్గాం జిల్లాలోని ఛ‌దూరా ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ బ‌ల‌గాల‌పై ఉగ్ర‌వాదులు కాల్పు‌లు జరిపిన ఘటనలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆగస్టు 17న బారాముల్లా జిల్లాల్లో ఉగ్రమూకలు కాల్పులకు పాల్పడి ముగ్గురు సైనికులు పొట్టనబెట్టుకున్నాయి. ఈ ఘటనలో పోలీస్ అధికారి సహా ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. బారాముల్లాలోని సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసుల సంయుక్త బలగాలపై ఉగ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ కాల్పుల్లో జమ్మూ కశ్మీర్‌ పోలీస్ అధికారి, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జరుగుతున్న ఈ వరుస అనైతిక దాడులను అరికట్టేందుకు భారత సైన్యం తగిన విధంగా శత్రుమూకలకు బుద్ధి చెప్పాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: