రాజకీయాలలో పరస్పరం సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవడం సదా మామూలే. ఇలాంటివి దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ చూస్తూ ఉంటాము. అయితే వివిధ రాజకీయ ఒత్తిళ్ల వలన కావొచ్చు లేదా రాజకీయ లాభాల వలన కావొచ్చు, నువ్వెంతంటే నువ్వెంత అని తిట్టుకున్న నాయకులు సైతం కలిసిపోయే పరిస్థితులు నెలకొంటాయి. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఏపీలో జరుగబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో జనసేన పార్టీని స్థాపించినప్పటి నుండి పార్టీకి అన్నీ తానై ముందుకు నడిపిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్. గతంలో రక రకాల రాజకీయ కారణాల వలన టీడీపీతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం జరిగింది. అయితే దీనికి జనసేనకు పెద్దగా ఒరిగిందేమీ లేకపోయినా, నష్టం భారీగానే జరిగింది.

ఒకవేళ ఆనాడు జనసేన ఒంటరిగా పోటీ చేసి ఉంటే కొన్ని సీట్లు తప్పకుండా వచ్చేటివి. కానీ ఈ విషయంలో రాజకీయ అనుభవం లేని పవన్ కళ్యాణ్ రాజకీయ మేధావి అనుభవశాలి చంద్రబాబు ప్రణాళికలో చిక్కుకున్నాడు. దీనితో కనీసం పవన్ కళ్యాణ్ కూడా గెలవలేక ఘోర ఓటమి పాలయ్యాడు. అప్పట్లో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య జరిగిన మాటల యుద్ధం అందరికీ తెలిసిందే.  అయితే ప్రస్తుతం రెండు రోజుల్లో జరగనున్న స్థానిక నగర పాలక ఎన్నికల నేపథ్యంలో కొన్ని జిల్లాలలో టీడీపీ మరియు జనసేన నాయకులు కలిసిన చిత్రాలు చూశాము. ఇప్పుడు అదే రీతిలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరులో ఎలాగూ టీడీపీ నాయకులు పోటీ చేయడం లేదు కాబట్టి జనసేనకు మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది.

దీనికి తోడు ప్రచార కార్యక్రమాలలో కూడా  టీడీపీ నాయకులు "పోటీలో సైకిల్ గుర్తు ఉంటే సైకిల్ కి వేయండి, పోటీలో సైకిల్ గుర్తు అభ్యర్థి లేకపోతే గ్లాస్ కి ఓటేయండి అంటూ ప్రచారాన్ని హోరెత్తించారట". మరి టీడీపీ ప్రణాళిక ఏమిటో అర్ధం కావడం లేదు. ఒకవైపు జనసేన మేము మీతో కలవము మొర్రో అంటుంటే కూడా, టీడీపీ ఈ విధమైన వైఖరికి అర్ధం ఏమిటో అంతుపట్టడం లేదు. టీడీపీ బలవంతంగా పార్టీని లాగేసుకుంటున్నారా...? ఒకవేళ ఇలా కనుక జరిగితే జనసేన మనుగడ కోల్పోయే ప్రమాదముంది. దీనిని కనుక జనసేన నాయకులు మొదట్లోనే ఖండించకపోతే ఎన్నికల సమయానికి ఓట్లు తారు మారు అయ్యే అవకాశముంది. దీని వలన బీజేపీకి కూడా నష్టం కలగొచ్చు. అయితే జనసేనాని మాత్రం దీనిపై ఏమీ స్పందించకపోవడం గమనార్హం. మళ్ళీ జనసేన టీడీపీతో కలుస్తుందా లేదా అంది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: