కరోనా అనేక విషయాల్లో మార్పు తెస్తోంది. ఈ కరోనా కరుడుగట్టిన నేరస్తుల మనసులు కూడా మార్చింది. ఆ వివరాల్లోకి వెళితే జైలులో శిక్ష అనుభవిస్తున్న వారు అక్కడి నుంచి బయటపడటానికి ఏమైనా చేస్తారు, కానీ ఉత్తర ప్రదేశ్ లోని 9 జైళ్లలో 21 మంది ఖైదీలు మాత్రం అదేం వద్దురా బాబోయ్ మాకు జైలే సేఫ్ అంటున్నారు. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి సమయంలో బయట ఉండడం కంటే జైలు శిక్ష అనుభవించడం వారికి 'సురక్షితమైనది మరియు ఆరోగ్యకరమైనది' కాబట్టి ఈ 21 మంది జైలు ఖైదీలు తమకు పెరోల్ వద్దు అని అధికారులకు లేఖ రాశారట. 


ఈ పెరోల్ తాత్కాలిక సస్పెన్షన్ కోసం అభ్యర్థన చేసిన ఖైదీలు గజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, మీరట్, మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, లక్నోతో సహా రాష్ట్రంలోని తొమ్మిది జైళ్లలో ఉంచినట్లు జైలు పరిపాలన డైరెక్టర్ జనరల్ ఆనంద్ కుమార్ ఆదివారం పిటిఐకి తెలిపారు. ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, ఖైదీల ఈ నిర్ణయం కారణంగా 90 రోజుల పెరోల్ వస్తే, ఇది శిక్షా కాలానికి చేర్చబడుతుందని పేర్కొన్నారు. పెరోల్ రద్దు చేయమనడానికి కారణం ఏమిటి అని అడిగితే వారు బయటకు వెళితే, వారికి జైల్లో లభించే ఆహారం మరియు ఇతర ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు లభించవని అందుకే ఈ పెరోల్ రద్దు చేయమని కోరారని చెప్పుకొచ్చారు.


 ఎందుకంటే జైళ్లలో క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరుగుతాయని, సమయానికి ఆహారాన్ని పొందుతారు, దీంతో బయట ఉండడం కంటే జైళ్ళలో సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉంటామని ఫీల్ అవుతున్నారని జైలు పరిపాలన డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఇక లక్నో జైలు నుంచి నాలుగు, ఘజియాబాద్ నుండి మూడు, మహారాజ్గంజ్ జైలు నుంచి రెండు అభ్యర్థనలు ఉన్నాయి. ఈ ఖైదీల అభ్యర్థనపై జైలు పరిపాలన స్పందన ఏమిటి అని అడిగినప్పుడు, "వారు దీనిని లిఖితపూర్వకంగా కోరినందున, మేము వారి వైఖరిని అంగీకరించి దానిని గౌరవించాలి" అని ఆయన అన్నారు. దేశంలో కరోనా కల్లోలం నేపధ్యంలో సుప్రీంకోర్టు మే 8న గత సంవత్సరం బెయిల్ లేదా పెరోల్ మంజూరు చేసిన ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: