ఆఫ్ఘానిస్థాన్ లో ఏర్పాటైన తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వంపై ఐక్యరాజ్య సమితి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలు గుర్తించేందుకు తాము చర్చలు జరపడం లేదని చెప్పింది. అది తమ బాధ్యత కాదని తెలిపింది. చర్చల ద్వారా ఏర్పడిన ప్రభుత్వం మాత్రమే దేశంలో శాంతి స్థాపనకు ఉపయోగపడుతుందని పేర్కొంది. ఆఫ్ఘాన్ పౌరుల హక్కులు, ముఖ్యంగా మహిళలు, యువతుల హక్కులను కాపాడే పరిష్కారానికి తాము కట్టుబడి ఉన్నట్టు ఐక్యరాజ్యసమితి తెలిపింది.

ఇక ఆఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ల ఆక్రమణ కారణంగా అనేకమంది చిన్నారులు తమ కుటుంబాలకు దూరమయ్యారని యూనిసెఫ్ తెలిపింది. ఇప్పటి వరకు దాదాపు 300మందిని గుర్తించినట్టు చెప్పింది. వీరి సంఖ్య పెరిగే అవకాశముందని పేర్కొంది. తరలింపు ప్రక్రియలో భాగంగా వందలాది చిన్నారులు విమానాల్లో ఇతర దేశాలకు చేరుకున్నట్టు పేర్కొంది. చిన్నారులను వారి కుటుంబాలకు అప్పగించే వరకు జాగ్రత్తగా చూసుకోవాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేసింది.

ఆప్ఘానిస్థాన్ లో అధికారం చేపట్టిన తాలిబన్లు మంచి పాలన అందిస్తారని ఆశిస్తున్నట్టు జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి.. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఇస్లామిక్ మత ఆచారాలు పాటిస్తూ ఆప్ఘాన్ లో తాలిబన్లు మంచి పాలన అందిస్తారనీ.. మానవహక్కులు గౌరవిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. వాళ్లు అన్ని దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు పెట్టుకునేందుకు ప్రయత్నించాలని అభిప్రాయపడ్డారు.

అయితే తాలిబన్లు మాత్రం షరియా చట్టాలకు అనుగుణంగానే తమ పాలన ఉంటుందని తాలిబన్లు తేల్చి చెప్పారు. పరిపాలన విధానంపై కీలక ప్రకటన చేసిన తాలిబన్లు.. భవిష్యత్ గురించి ఆందోళన వద్దనీ.. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. భవిష్యత్ లో ఆప్ఘాన్ల జీవితాలను ఇస్లామిక్ చట్టమైన షరియాను అనుసరించి క్రమబద్దీకరిస్తామని తెలిపారు. తాలిబన్లకు మద్దతు ఇచ్చి వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు.


తాలిబన్లు అయితే అలా ప్రకటిస్తున్నారు గానీ.. అక్కడి పరిస్థితులు మాత్రం చాలా ఘోరంగా ఉంటున్నాయి. మరి రాబోయే రోజుల్లో తాలిబన్లు సంక్షేమ పాలన అందిస్తారో లేదో చూడాలి.

 












మరింత సమాచారం తెలుసుకోండి: