కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ రాహుల్ గాంధీ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి పావులు కదువుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. గత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులతో కలిసి దేశ వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు, భారత్ బంద్ చేపట్టారు. చివరికి పార్లమెంట్ బయట మాక్ అసెంబ్లీ కూడా నిర్వహించిన రైతులకు మద్దతు కూడా తెలిపింది కాంగ్రెస్ పార్టీ. ఇక పెరిగిన ఇంధన ధరలపై అయితే ఇప్పటికే ఆరోపణలు చేస్తూనే ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ఇక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విమర్శల జోరు పెంచారు కాంగ్రెస్ నేతలు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మరోసారి కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మల్లిఖార్జున ఖర్గేతో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా ఈ బహిరంగ సభకు హాజరయ్యారు. బీజేపీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ... రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ, హిందుత్వం అంశాలను రాహుల్ ప్రస్తావించారు. తాను హిందువునే అంటూ ప్రకటించిన రాహుల్... హిందుత్వ వాదిని మాత్రం కాదన్నారు. భారత్‌ హిందువుల దేశమని... అంతే కాని హిందుత్వ వాదులది మాత్రం కాదన్నారు. గాంధీ కూడా హిందువే అన్నారు. అయితే... గాడ్సే హిందుత్వ వాది అని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని.. వాటిని అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాహుల్ ఆరోపించారు. అధికారం కోసం పాకులాడే వాళ్లు హిందుత్వ వాదులంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు రాహుల్. ఏడేళ్లుగా దేశాన్ని దోచుకుంటున్నారని... 70 ఏళ్లు కాంగ్రెస్ కష్టపడి నిర్మించిన దేశాన్ని... మోదీ... తన మిత్రులకు దోచిపెట్టారని ఆరోపించారు. ప్రతి ఎన్నికల సమయంలో కులం, మతం పేరుతో రాజకీయం చేస్తున్నారని ప్రియాంక వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: