
అయితే ప్రజల మేలుకోసం, భావితరాల బంగారు భవిత కోసం జరిగే నిర్మాణాత్మక కార్యక్రమాలేమిటో, నమ్మించి గొంతు కోసే కుటిల రాజకీయాలేవో తెలుసుకోవాల్సింది ప్రజలే. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడాల్సింది యువతే. వారిని ఆ దిశగా మేల్కొల్పి నడిపించాల్సింది మేధావి వర్గమే. అయితే రాష్ట్రంలో ఈవిధమైన ప్రయత్నాలు ఏమీ కానరావడం లేదన్నదే నిష్టుర నిజం. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి కదలాల్సిన ప్రజలు సంకుచిత భావాల రొంపిలో పడి బయటకు రాకపోవడం చేతనే శాశ్వత నష్టం జరిగిపోతున్నా ఎవరికీ పట్టడం లేదని రాష్ట్రం బాగు కోరుకునే అత్యధికుల అభిప్రాయం. నిజానికి వర్తమాన సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలతో ఏమాత్రం సంబంధం లేని, వాస్తవిక పరిస్థితులపై కాస్తైనా అవగాహన పెంచలేని, విద్యార్థి దశ నుంచే యువతకు నాయకత్వ లక్షణాలు అలవరచలేని నేటి విద్యావ్యవస్థే ఇందుకు ప్రధాన కారణమంటున్న సామాజిక వేత్తల అభిప్రాయాలు ఏమాత్రం కొట్టిపారేయదగ్గవి కావు. ఐక్యంగా పోరాడలేని ఏ సమూహమూ తమకు న్యాయబద్దంగా రావాల్సిన ప్రయోజనాలను పొందలేదన్నది కఠిన వాస్తవం. ఇది ప్రస్తుత ఆంధ్రజాతికి వర్తించినంతగా మరెవరికీ పోలదన్నదీ అంతే నిజం.