ఐదు రాష్ట్రాల ఎన్నికల సందడి ముగిసింది. ఇక అందరి చూపు మార్చి 31న జరగనున్న రాజ్యసభ పోల్స్,జూలైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నిక పైకి మరలింది. ముఖ్యంగా తదుపరి రాష్ట్రపతి ఎవరనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ మొదలైంది. అయితే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ సాధించిన రికార్డు విజయం అటు రాజ్యసభ పోల్స్,ఇటు రాష్ట్రపతి ఎన్నికలపై తక్షణ ప్రభావం చూపనుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజ్యసభలో పాలక బీజేపీ పట్టును మరింత బలోపేతం చేశాయి. ఈ సంవత్సరం జరగనున్న రాష్ట్రపతి పదవి కూడా సునాయాసంగా బీజేపీకి దక్కేలా తాజా ఫలితాలు నిర్దేశించాయి.

దేశంలోని 776 మంది ఎంపీలు, 4,120 మంది శాసన సభ్యులు కలిసి భారత రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఎలక్ట్రోలర్ కాలేజీ మొత్తం సంఖ్య 10,98,903 ఓట్లు కాగా బీజేపీ బలం 50 శాతం పైనే ఉంది.ఒక్కో ఎంపీ ఓటు 708 విలువ ఉంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ దాని మిత్ర పక్షాలు కలిసి 270 శాసనసభా స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో పాలక పార్టీకి తదుపరి రాష్ట్రపతి ఎంపిక పై పట్టు చిక్కింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సారి రాష్ట్రపతి పదవికి ప్రధాన పోటీదారుగా ఉండగా, ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కే బిజెపి నాయకత్వం మరోసారి అత్యున్నత పదవిలో కొనసాగించాలని భావిస్తుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రావడం లేదు.అయితే వీరిద్దరి లోనే ఎవరో ఒకరు తదుపరి రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టనున్నారని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. రామ్ నాథ్ కోవింద్ కే రెండోసారి అవకాశం ఇస్తే స్వతంత్ర భారత చరిత్రలో తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ తర్వాత రెండు సార్లు అత్యున్నత పదవికి ఎన్నికైన వ్యక్తిగా రామ్ నాథ్ నిలవ నున్నారు. రాష్ట్రపతి ఎన్నికకు చాలా ప్రక్రియ ఉంటుంది.

 కానీ,రాష్ట్రపతి భవన్ లో ఉండదగిన వ్యక్తి ఎవరనేది అంతిమంగా ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం తన మిత్రపక్షాలు, మద్దతిచ్చే పార్టీల ఏకాభిప్రాయానికి విలువనిస్తోందని, అప్పుడు మాత్రమే తదుపరి భారత రాష్ట్రపతి ఎంపిక తేలికవుతుందని కేంద్రం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏకాభిప్రాయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నవీన్ పట్నాయక్ బిజెడి పార్టీని కూడా కేంద్రం సంప్రదించవచ్చని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: