ఎవరికోసమో ఇంకెవరిమీదో బురదచల్లేద్దామని అనుకుంటే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. ఇపుడు ఎల్లోమీడియా వ్యవహారం అచ్చంగా అలాగే తయారైంది. అసెంబ్లీ, గవర్నర్, ముఖ్యమంత్రి మీద తప్పుడు వార్త రాసినందుకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సొస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే బడ్జెట్ సమావేశం ప్రారంభంరోజున గవర్నర్ అబ్దుల్ అజీజ్ ను జగన్మోహన్ రెడ్డి వెయిట్ చేయించారట. అలాగని టీడీపీ ఎంఎల్ఏ పయ్యావుల కేశవ్ ఆరోపించారు.  ఎంఎల్ఏ  ఆరోపించారో లేదో ఎల్లోమీడియా పెద్ద వార్త రాసేసింది.





ఎల్లోమీడియాలో వచ్చిన వార్తచూసి ప్రభుత్వంతో పాటు అధికారపార్టీ కూడా ఆశ్చర్యపోయింది.  తప్పుడు వార్తను కావాలనే ఎల్లోమీడియా వండి వార్చిందని అర్ధమైపోయింది. ఆ వార్తను ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి ఖండించటమే కాకుండా అసెంబ్లీలోనే నిజమేమిటో వీడియో సాక్ష్యంగా నిరూపించారు. వీడియోలో జగన్ వచ్చిన తర్వాతే గవర్నర్ అసెంబ్లీకి వచ్చారని అర్ధమైంది. గవర్నర్ రాగానే జగన్ తో పాటు స్పీకర్ తమ్మినేని సీతారామ్, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు స్వాగతం పలకటాన్ని అందరుచూశారు.





అందరు కలిసి స్పీకర్ తమ్మినేని ఛాంబర్లో ఓ ఐదు నిముషాలు కూర్చుని అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వాస్తవం ఇలాగుంటే జగన్ కోసం గవర్నర్ స్పీకర్ ఛాంబర్లో వెయిట్ చేశారని ఎంఎల్ఏ ఆరోపించటం, నిజమేమిటో తెలుసుకోకుండా ఎల్లోమీడియా పెద్దక్షరాలతో రాసేయటం విచిత్రంగా ఉంది. దీని ఫలితం ఏమిటంటే సమావేశాల తర్వాత ప్రత్యేకంగా కేశవ్, ఎల్లోమీడియా మీద చర్యలకు ప్రివిలేజ్ కమిటి సమావేశం ఏర్పాటు చేయాలని స్పీకర్ ఆదేశించారు.





వీలైనంత తొందరగా ప్రివిలేజ్ కమిటి సమావేశం జరపాలని సభ్యులు కూడా నిర్ణయించారు. దాంతో కేశవ్ తో పాటు ఎల్లోమీడియా మీద చర్యలు తప్పవనే అనిపిస్తోంది. ఈమధ్యనే టీడీపీ నేత పట్టాభిని పోలీసులు చచ్చేట్లు కొట్టారని ఫొటోలేసి బ్యానర్ స్టోరీ రాసేసింది. తీరాచూస్తే ఆ వార్త తప్పుడువార్తని తేలింది. దాంతో చేసేదిలేక ఎల్లోమీడియా యాజమాన్యం క్షమాపణలు చెప్పుకున్నది. మళ్ళీ ఇపుడు కూడా అలాంటి తప్పుడు వార్తే రాసింది. చంద్రబాబునాయుడు కోసం  జగన్ పైన ఎల్లోమీడియా బురద చల్లేస్తోంది. దాని ఫలితంగానే తొందరలో ప్రివిలేజ్ కమిటి ఆగ్రహానికి గురికాబోతోందా అనే సందేహం పెరిగిపోతోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: