అక్రమార్జన కేసులో దివంగత ముఖ్యమంత్రి జయలలితకు శిక్షపడిన విషయం తెలిసిందే. ఆవిడ సంపాదించిన అక్రమాస్తులు ఎన్నో స్పష్టంగా తెలియదుకానీ కోర్టుగుర్తించిన ఆస్తులను, స్వాధీనం చేసుకున్న వాటిని వేలంపాటల ద్వారా అమ్మే ప్రక్రియ రెడీ అవుతోంది. ఈ వేలంపాటలు కూడా కోర్టు ఆదేశాల ప్రకారమే జరుగుతోంది. తాజాగా బయటపడిన ఆస్తుల ప్రకారం 7 కేజీల బంగారు, వజ్రాభరణాలు, 600 కిలోల వెండి వస్తువులు, ఆబరణాలు, 11 వేలకు పైగా చీరలున్నాయట.





ఇవికాకుండా పొయస్ గార్డెన్ ఇంట్లో ఆమె వాడిన ఫర్నీచర్, చేతిగడియారాలు, ఖరీదైన పెన్నులు, మంచాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఏసీ, రిఫ్రిజిరేటర్ లాంటి అనేక వస్తువులను కూడా వేలంద్వారా అమ్మబోతున్నారు. 750 జతల చెప్పులు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ అమ్మేందుకు న్యాయస్ధానం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించింది. వీటి విలువను నిపుణులతో అంచనావేయించి ఫైనల్ గా ఒక ధరను నిర్ణయిస్తారు. ధర నిర్ణయం అయిన తర్వాత అప్పుడు వేలం ప్రక్రియకు తేదీని ప్రకటిస్తారు.





నిజానికి ఇపుడు చెప్పినవన్నీ చరాస్ధులు మాత్రమే. స్ధిరాస్తుల రూపంలో కొడనాడులో టీ ఎస్టేట్, పొయేస్ గార్డెన్ ఇంటితో పాటు ఎన్నో ఎస్టేట్లు, భవనాలు, కాఫీ తోటలు, ఫాంహౌసులున్నట్లు ప్రచారంలో ఉంది. అన్నింటి విలువ లెక్కిస్తే కొన్ని వేల కోట్లరూపాయల ధర పలుకుతుందని సమాచారం. హైదరాబాద్ లోని జీడిమెట్లలో కూడా 12 ఎకరాల ఫాం హౌస్ ఉందనే ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది.





కోర్టు ఇప్పుడు అధికారికంగా గుర్తించి బంగారు, వజ్రాభరణాలు తక్కువనే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆమె మరణించక ముందే అనారోగ్యంతో మంచం మీదున్నారు. అప్పట్లోనే బంగారు, వజ్రాల ఆభరణాలతో పాటు మరెన్నో విలువైన వస్తువులను బయటకు తీసుకెళ్ళిపోయారనే ఆరోపణలు, ప్రచారం అందరికీ తెలిసిందే. ఆమె నెచ్చెలిగా వ్యవహరించిన శశికళ మీదే ఆరోపణలున్నీ ఉన్నాయి. అక్రమాస్తుల కేసులో జయతో పాటు శశికళను కూడా దోషిగా తేల్చి కోర్టు శిక్షవేసిన విషయం తెలిసిందే. నాలుగు సంవత్సరాల శిక్షను అనుభవించి ఏడాది క్రితమే విడుదలయ్యారు. అంటే మాయమైపోయినవి పోగా మిగిలిన వాటిని మాత్రమే కోర్టు వేలం వేయబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: