ఉత్తరాదిలో భారతీయ జనతా పార్టీని కంట్రోల్ చేయడానికి మిగిలిన రాజకీయ పార్టీలు చేతులు కలుపుతున్నాయి! కాంగ్రెస్ కు ఇప్పుడప్పుడే జవసత్వాలు అంది భారతీయ జనతా పార్టీని నియంత్రిస్తుందనే ఆశలు లేకుపోవడంతో.. ప్రాంతీయ పార్టీలే కలిసి పెద్ద శక్తులుగా అవతరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఒకే గొడగు కింద నుంచి వచ్చి.. ప్రాంతీయ పార్టీలు పెట్టుకొని ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని సాధించేంత స్థాయికి ఎదిగిన వారు ఇప్పుడు మళ్లీ దగ్గరవుతున్నారు. బీహార్ లో ఇన్ని రోజులూ ఒకరితో ఒకరు ఢీ అంటే ఢీ అన్నట్టు పోరాడిన ఆర్జేడీ, జేడీయూ పార్టీలు విలీనం కావడం ఖాయమైంది. ఈ మేరకు ఒక ప్రకటన వచ్చింది. ప్రస్తుతానికి ఈ రెండు పార్టీలూ విలీనం అవుతాయని.. తర్వాత సమాజ్ వాదీ పార్టీ, జేడీఎస్ లు ఈ గొడుగు కిందకు వస్తాయని ఆర్జేడీ, జేడీయూ అధినేతలు ఒక ప్రకటన చేశారు. గతంలో జేడీయూ వాళ్లు బీజేపీకి సన్నిహితంగా ఉండగా, ఆర్జేడీ కాంగ్రెస్ తో కలిసి యూపీఏలో గడిపింది. అప్పుడు ఈ రెండు పార్టీల అధినేతలు ఒకరిపై ఒకరు రాజకీయంగా కత్తులుదూసుకొనే వాళ్లు. ఇప్పుడు మాత్రం సన్నిహితులయిపోయారు. దీనికంతటికీ కారణం భారతీయ జనతా పార్టీ బలపడటం. బీహార్ లో బీజేపీ ఒంటరిగానే సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. దీంతో ఎలాగైనా కమలం పార్టీకి ముకుతాడు వేయడానికి జేడీయూ. ఆర్జేడీలు చేతులు కలుపుతున్నాయి. మరి ఇలాంటి విలీనాలు భారతీయ జనతా పార్టీకి ఎంత వరకూ ఎదురు నిలవగలవో!

మరింత సమాచారం తెలుసుకోండి: