టీడీపీ అధినేత చంద్రబాబుకు కనీసం బుద్ది, జ్ఞానం లేవని మండిపడుతున్నారు వైసీపీ మంత్రి కొడాలి నాని. ఇసుక సమస్యపై టీడీపీ చేస్తున్న ఆందోళనలపై ఆయన స్పందించారు. పదేళ్లలో ఎన్నడూ లేనంత వరదలు వస్తే ఇసుక ఎలా దొరుకుందో చెప్పాలన్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తికి ఈ మాత్రం బుద్ధీ, జ్ఞానం లేవా అని కొడాలి నాని నిలదీశారు.


కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్‌ కార్యాలయంలో వైయస్‌ఆర్‌ క్రాంతి పథకం కింద మెగా రుణ మేళాను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ఆ సమయంలోనే కొడాలి నాని ఈ కామెంట్లు చేశారు. నవరత్నాలు అన్నింటినీ అమలు చేసి తీరుతామని మంత్రి కొడాలి నాని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు అన్నింటిని అమలు చేయడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చూపిన బాటలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పయనిస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే తపనతో సీఎం ఉన్నారని చెప్పారు.


గుడివాడ నియోజకవర్గంలోని మండలాల్లో 1188 సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.49.57 కోట్లు, గుడివాడ పట్టణంలోని 852 సంఘాలకు రూ.15.50 కోట్ల రుణాలను మంత్రి నాని పంపిణీ చేశారు. అదే విధంగా స్త్రీ నిధి కింద 852 సంఘాలకు రూ.6.70 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ పై మున్సిపల్‌ కార్యాలయంలో మంత్రి కొడాలి నాని సమీక్షా సమావేశం నిర్వహించారు.


గుడివాడ నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల పంపిణీపై ఆర్డీఓ సత్యవాణి, మున్సిపల్‌ కమిషనర్‌ పీజే సంపత్‌ కుమార్‌ హాజరయ్యారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులు ఎంత మంది ఉన్నారు.. వీరికి ఎంత భూమి అవసరం..? ఇప్పటి వరకు ఎంత భూమిని ఏయే ప్రాంతాల్లో సేకరించారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: