దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దిశ హత్యోదంతం పార్లమెంటులో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తుతున్నాయి. దిశ ఉదంతంపై పార్లమెంటులో అత్యవసర చర్చ జరుగుతోంది. రాజ్యసభలో కూడా ఈ అంశంపై తీవ్ర చర్చ  జరుగుతోంది.

 

 

'పలువురు ఎంపీలు గళమెత్తితేనో, మహిళలకు కేవలం చట్టాలు చేస్తేనో బాధితులకు న్యాయం జరగదు. చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. మహిళలపై దాడులకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటువంటి దారుణాలు జరగకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. పోలీసు వ్యవస్థ మరింత పటిష్టంగా మారాలి. శిక్ష పడిన తర్వాత కూడా ఏం జరుగుతుందో మనకు తెలుసు.  ఇటువంటి ఘటనల్లో నిందితులకు క్షమాభిక్ష అవసరమా? దీనిపై చట్టాలు మరాల్సిన అవసరముంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కుల, మత, వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదన్నారు. చట్టాలు మార్చటం కంటే రాజకీయ సంకల్పం, పరిపాలన నైపుణ్యం సరిపోతాయి' అని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభలో అన్నారు.

 

 

ఇంకా పలువురు సభ్యులు దిశ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జయా బచ్చన్ మాట్లాడుతూ.. 'ఇటువంటి ఘటనలపై ఇదే వేదిక మీద ఎన్నో మాటలు మాట్లాడుతున్నాం కానీ.. శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నాం. నిందితులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది' అన్నారు. ఇంతకుముందు చట్టాలు చేసినా ఉపయోగం లేదనిపిస్తోంది. ఇటువంటి రుగ్మతలను మూలాల నుంచి పెకిలించాల్సిన అవసరముంది. ఇందుకు యావత్ దేశం ఒక్కటిగా నిలవాల్సిన సమయం వచ్చిందని పలువురు సభ్యులు రాజ్యసభలో అన్నారు. పార్లమెంట్, శాసనసభ, విద్యాసంస్థలు, ప్రైవేట్ సంస్థల్లోనూ ఇలాంటి వాతావరణం ఏర్పడాలని ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: