అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ప్రకటనకు తగినట్లుగానే జీఎన్ రావు కమిటీ రాజధానులు, హైకోర్టు భిన్న ప్రాంతాలలో ఉండాలన్న సూచనలు చేసింది. కమిటీ అమరావతిలో అసెంబ్లీ, రాజ్ భవన్ వైజాగ్ లో క్యాంప్ కార్యాలయం, వేసవి అసెంబ్లీ, సచివాలయం, కర్నూలులో హైకోర్టు, అమరావతి, వైజాగ్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. తమకు 35 వేల వినతులు వచ్చాయని 2 వేల మంది రైతులతో నేరుగా మాట్లాడామని కమిటీ తెలిపింది. 
 
అమరావతిలోని సచివాలయ ఉద్యోగులు జీఎన్ రావు కమిటీ నివేదికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరం నుండి రాజధానికి వచ్చి ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నామని ఇలాంటి సమయంలో మరలా ఉద్యోగులను వైజాగ్ కు తరలించడం దారుణం అని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగ సంఘాల నాయకుల నుండి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పందన వ్యక్తం కాలేదు. 
 
రాజధాని ప్రాంతంలోని రైతులు మూడు రాజధానుల నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో పాటు సీఎం జగన్ ఫ్లెక్సీలను కూడా చింపివేశారు. రైతులు రోడ్లపై టైర్లను వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాలకు చెందిన రైతులు సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కమిటీ నివేదికకు వ్యతిరేకంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. 
 
కమిటీకి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేయగా కమిటీ నివేదికను కొందరు తప్పుబడుతున్నారు. జగన్ అసెంబ్లీలో ప్రకటన చేసిన విధంగానే నివేదిక ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కమిటీ సూచనలు సీఎం అభిప్రాయానికి దగ్గరగా ఉన్నాయని పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని వికేంద్రీకరణ ప్రకటనను రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికపై కర్నూలు, వైజాగ్ వాసులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో అభివృద్ధి జరిగేలా కమిటీ నివేదిక ఉందని అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: