ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారు సీఎం జగన్. జగన్ నిర్ణయంతో ఇప్పుడు అమరావతి గ్రామాల ప్రజలు రగిలిపోతున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 34 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నారు. అయితే ఈ ఉద్యమాలకు అంతగా స్పందన కనిపించడం లేదు.

 

అయితే అసలు అమరావతిని చంపేసిందే చంద్రబాబే అంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే.. అసలు ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించే సమయంలో చంద్రబాబు అన్ని పార్టీల ఏకాభిప్రాయం తీసుకుని ఉంటే.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉండేది కాదు. రాజధాని ప్రాంతంగా అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేయడం నిర్ణయం.. అంతా ఏకపక్షంగా తన సొంత ఇంటి నిర్ణయంగా అమలు చేశారు చంద్రబాబు.

 

ఈ విషయంలో రాష్ట్రంలోని అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోవాల్సిన చంద్రబాబు తన సొంత నిర్ణయాలతో ఏకపక్ష వైఖరి అవలంభించారు. రాజధాని నిర్ణయం ఐదేళ్లలోనో..పదేళ్లలోనే అయ్యే పనికాదు. అయినా తానే శాశ్వత సీఎం అన్న భ్రమల్లో చంద్రబాబు వ్యవహారించిన తీరు ఇప్పుడు అమరావతి గొంతు నులమడానికి కారణం అవుతోంది.

 

పోనీ.. ఆ తర్వాతైనా సవ్యంగా చేశారా అంటే అదీ లేదు. ఇన్ సైడర్ ట్రేడింగ్ తరహాలో అమరావతి ప్రాంతంలో భూములపై కన్నేసి.. ఆర్థికంగా బలపడాలని ప్రయత్నించారు. తనకు నచ్చినవారికి ముందే సమాచారం అందించి.. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారు. దీనికి తోడు తన ఐదేళ్ల పాలనా కాలంలో శాశ్వత నిర్మాణాల కోసం ప్రయత్నించకుండా.. గ్రాఫిక్సులతో డిజైన్లతో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపారు.

 

డిజైన్ల కోసమే ఏళ్ల తరబడి కాలయాపన చేసారు. అలా కాకుండా అమరావతి నిర్మాణం కొంతమేరకైనా జరిగి ఉంటే.. ఇప్పుడు జగన్ రాజధాని తరలించే సాహసం చేయకపోయేవాడన్నది విశ్లేషకుల అభిప్రాయం. దీన్ని బట్టి చూస్తే అమరావతి నగరాన్ని చంపేసింది జగన్ కాదు.. ఒక విధంగా చంద్రబాబే అంటే తప్పు కాదేమో కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: