మున్సిపల్ ఎన్నికలు అనగానే ఎంతో మంది ఆశావహులు.. కొంతమందికి మాత్రమే పార్టీ టికెట్లు... మిగతావారు ఇండిపెండెంట్లు... ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో ఫీట్లు... చివరికి నేడు ఓటర్లు తేల్చనున్నారు అభ్యర్థుల ఫేట్లు ... నేడు ఉదయం నుంచి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఈరోజు వరకు తమను  ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేసిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు . మున్సిపల్ ఎన్నికల్లో తమ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. అటు  అభ్యర్థుల్లో కూడా తీవ్రస్థాయిలో ఉత్కంఠ నెలకొంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేశాం... ఇక తమ గెలుపుకు ఆ దేవుడే దిక్కు అనుకుంటూ ఎంతో టెన్షన్ పడుతున్నారు అభ్యర్థులు. ముందే మున్సిపల్ ఎన్నికలు అంటే అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమాయే. 

 

 

 ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అవ్వగా సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఇక పోలింగ్ కేంద్రాల వద్దా  ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక రాష్ట్రంలోని 80 నియోజకవర్గాల్లో... 123 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లకు నేడు పోలింగ్ జరుగుతుంది. ఇక ఇప్పటికే ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఉండగా అటు అన్ని పార్టీల్లో  తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొంది. ఇకపోతే పోలింగ్ కేంద్రాలకు ఎంతోమంది రాజకీయ సినీ ప్రముఖులు సైతం వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట పురపాలక సంఘం ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని 44 వ వార్డులో నెహ్రు నగర్లోని 136 పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

 

 

 ఇక మిర్యాలగూడలోని 59 వ పోలింగ్ కేంద్రంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు లు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. నల్గొండ పట్టణం లోని 30 వ వార్డులో నల్గొండ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు పోలింగ్ కేంద్రంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట జిల్లా 14వ వార్డు లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో... ఎంపీ,  టీపిసిసి ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సతీమణి మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో  ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: