అఖిల భారతీయ హిందూ మహాసభ అధ్యక్షుడిని(ఉత్తర్ ప్రదేశ్‌) ఇద్దరు వ్యక్తులు లక్నోలో అమానుషంగా  కాల్చి చంపారు. హజ్రత్‌గంజ్‌ ప్రాంతంలో అఖిల భారతీయ హిందూ మహాసభ అధ్యక్షుడు రంజీత్ బచ్చన్ మార్నింగ్ వాక్ చేస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ బైక్‌పై వచ్చి అతన్ని కాల్చి చంపారు. ఆసమయంలో అతని వద్ద అతని స్నేహితుడు వున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్‌టిట్యూట్ భవంతి దగ్గర ఈ కాల్పులు జరిగాయి. 

 

రంజీత్ తలలోకి బుల్లెట్లు దిగడంతో అక్కడికక్కడే ఆయన మృతిచెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీలో ఆ వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. అతను ప్రస్తుతం కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. రంజీత్ బచ్చన్ నడుస్తుండగా ముందుగా అతని మెడలోని బంగారం చైన్ మరియు సెల్‌ఫోన్‌ను లాక్కునే ప్రయత్నం దుండగులు చేశారని దీన్ని ఆయన ప్రతిఘటించడంతో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.

 

కాల్పులు జరిపిన దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే దుండగులు హత్య చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారని అయితే నేరాన్ని మాత్రం లూటీగా చిత్రీకరించాలనే ప్రయత్నం చేశారని పోలీసులు చెప్పారు. రంజీత్ బచ్చన్‌ తలలోకి బుల్లెట్ దిగిందని సెంట్రల్ లక్నో డీసీపీ దినేష్ సింగ్ చెప్పారు. మరో వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడ్డాడని వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ నిపుణులు ఆ ప్రాంతంను పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

 

అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని చెప్పిన పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుని శిక్షిస్తామని చెప్పారు. ఇక కేసు విచారణ నిమిత్తం రంగంలోకి ఆరు బృందాలను దింపినట్లు డీసీపీ వెల్లడించారు. నిందితుల కోసం ఇప్పటికే ఆరు బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో రెండో హిందూ నేత హత్యకు గురయ్యారని చెప్పారు. ఇదిలా ఉంటే బచ్చన్ హత్యకు గురైయ్యాడన్న వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు లక్నోకు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. ఇంకా బచ్చన్ కుటుంబ సభ్యులతో మాట్లాడలేదని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: