గులాబీ బాస్ ... కమలం పార్టీతో కయ్యానికి కాలు దువ్వుతున్నారా? తానే వేస్తున్న రాజకీయ అడుగులతో  కేంద్రానికి ఇటువంటి సంకేతాలనే పంపాలని కేసీఆర్ భావిస్తున్నారా ? ఇనాళ్లూ చూసి చూడనట్టు వదిలేసినా.. ఇకపై దూకుడుగానే ఉండాలని నిర్ణయించారా ? ఇంతకీ కేసీఆర్ మనుసులో ఏముంది ? 

 

బిల్లుగా ఉన్నప్పుడే పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకించిన టీఆర్ఎస్‌.. ఇప్పుడది చట్టమయ్యాక మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. సిఏఏని వ్యతిరేకిస్తూ కేబినెట్‌ తీర్మానం కూడా చేసేసింది. త్వరలోనే అసెంబ్లీ తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపాలని డిసైడైంది. దీంతో కేంద్రంతో భవిష్యత్తులో టీఆర్‌ఎస్ సర్కార్‌ రిలేషన్‌ ఏ విధంగా ఉండబోతోందన్న చర్చ మొదలైంది. సీఎఎ విషయంలో కేంద్రంతో ఢీ అంటే ఢీ అనేందుకు కేసీఆర్‌ సిద్దం అయినట్టు తెలుస్తోంది. గత ఆరేళ్లకాలంలో కేంద్రంతో ఎప్పుడూ ఘర్షణ పడని కేసీఆర్‌ .. దేశవ్యాప్త అంశాలు పక్కనబెట్టి  తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యంగా.. కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నారు.

 

కేసీఆర్ రెండో సారి సీఎం అయ్యాక.. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త గ్యాప్‌ వచ్చినట్టు తెలుస్తోంది. ఒక వైపు రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ ఎత్తుగడ వేస్తుండగా.. కేసీఆర్‌ కూడా కమలదళాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే మున్సిపోల్స్ ముగిసిన వెంటనే మీడియా ముందుకొచ్చిన కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ విధానాలు తప్పుపట్టారు . ఆర్టికల్‌ 370 రద్దును అభినందిస్తూనే సిఏఏని వ్యతిరేకించారు. ఇది దేశానికి ప్రయోజనకరం కాదనీ ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని బీజేపీకి సూచించారు. త్వరలోనే అసెంబ్లీలో సీఏఏకి వ్యతిరేక తీర్మానం చేస్తామనడం ద్వారా.. ఆ చట్టాన్ని రాష్టంలో అమలు చేయాబోమన్న సంకేతాలనూ పంపించారు కేసీఆర్‌. అంతేకాదు, ఇక బీజేపీతో ఎలా మెలగాలనే విషయంలో పార్టీ శ్రేణులకూ ఓ క్లారిటీ ఇచ్చేశారు.ఒక వైపు రాష్ట్ర ప్రయోజనాలు.. మరోవైపు కేంద్రం చేస్తున్న చట్టాల మీద స్పష్టమైన అవగాహనతో ఉండాలన్నది సీఎం కేసీఆర్‌ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే ఇటీవల కేంద్ర బడ్జెట్‌ పైనా గట్టిగానే స్పందించారు. ఇన్నాళ్లూ బీజేపీ పట్ల కొంత అచితూచి వ్యవహరించాలనుకున్నా.. ఇప్పుడిక కటువుగానే ఉండాలని గులాబీ బాస్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తే కేంద్రంలో ఉన్న బిజేపీతో డీ కొట్టేందుకే రెఢీ అయినట్టు స్పష్టమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: