చంద్రబాబును గతంలో చేసిన పాపాలు వెంటాడుతున్నాయి. గతంలో అనేక విషయాల్లో ఆయన అనుసరించిన వైఖరి ప్రస్తుతం ఇబ్బంది కరంగా మారుతోంది. నిన్న విశాఖ పర్యటనలో తనను అడ్డుకున్నందుకు చంద్రబాబు వైసీపీ నేతలపై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో చంద్రబాబుకు సానుభూతి రాకపోగా.. ఆయన గతంలో చేసిన పాత పాపాలను గుర్తు చేస్తూ వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు హిస్టరీ ఒక్కసారి గుర్తు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా..? పోలీసులు ఇచ్చే గౌరవం ఇదేనా అని చంద్రబాబు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.



నిజమే.. ప్రతిపక్ష నేతకు మంచి గౌరవమే ఇవ్వాలి.. కానీ గతంలో చంద్రబాబు చేసిందేంటి..? రెండేళ్ల క్రితం ప్రత్యేక హోదా కోసం కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు ప్రతిపక్షనేతగా ఉన్న వైయస్‌ జగన్‌ విశాఖకు వచ్చినప్పుడు ఏపీ పోలీసులు రన్‌వేపైకి వెళ్లి అడ్డుకున్నారు. కనీసం ఎయిర్‌పోర్టులోకి కూడా అడుగుపెట్టనివ్వకుండా చేశారు. మరి అప్పుడు పోలీసులు చేసింది సమంజమా..? ఇంకా ఇప్పుడు చంద్రబాబు పర్యటనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ, అప్పుడు అనుమతి కూడా ఇవ్వలేదు.



అంతే కాదు.. పులివెందుల నుంచి రౌడీలు, గుండాలు విశాఖకు వచ్చి అల్లర్లు చేస్తున్నారని చంద్రబాబు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. కానీ.. తునిలో కాపు నేత ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో సభ పెడితే.. అక్కడ రైల్వే బోగిని కొంత మంది కడప నుంచి వచ్చి తగలబెట్టారని చంద్రబాబు మాట్లాడారు. కానీ.. సీఐడీ ఎంక్వైరీలో ఎంత మంది కడప వాళ్లను అరెస్టు చేశారు..? అది బోగస్‌ అని తేలిపోయింది. అంటే.. ఏది జరిగినా పులివెందుల, కడప అని ఆరోపణలు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిన విషయం బయటపడుతోంది.



కడప, కర్నూలు వాసులను రౌడీలు, గుండాల్లా ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు. ఇటువంటి ప్రచారం చేస్తే రాయలసీమలో కూడా చంద్రబాబు అడ్డుకొని వెనక్కు పంపించే ప్రమాదం ఉంది. అయితే చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని చెప్పి అడ్డుకున్నారని వైసీపీ నేతలు సమర్థించుకుంటున్నారు. ఒక వ్యక్తి పర్యటన కోసం షూట్‌ ఎట్‌ సైట్‌ ఆర్డర్స్‌ ఇవ్వాలని బాబు ఆశిస్తున్నారా..? అని ప్రశ్నిస్తున్నారు. ప్రజా ఆగ్రహం చూసి వెనక్కు వెళ్లాల్సిన వ్యక్తి నాలుగు గంటలు రోడ్డు మీద కూర్చొని రాజకీయం చేయాలని చూశాడని ఎదురు దాడి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: