ఉమ్మడి ఖమ్మం జిల్లా సింగరేణి ఏరియాలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. సరైన శిక్షణ లేని డ్రైవర్లు బొగ్గు టిప్పర్లను నడిపిస్తున్నారు. ఫలితంగా పదుల సంఖ్యలో జనం ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోజుకు ఎక్కువ ట్రిప్పులను తిప్పాలనే లారీ యజమానుల అత్యాశే ఇక్కడి జనం ఉసురు తీస్తోంది. సత్తుపల్లి నుంచి కొత్తగూడెం బొగ్గు రవాణా చేసే క్రమంలో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే...దీనిపై చర్యలు తీసుకోవాల్సిన సింగరేణి అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.  

 

ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి ఓసి నుంచి కొత్తగూడెం రోజూ బొగ్గు తరలిస్తుంటారు. నిత్యం వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా రవాణా చేస్తూ ఉంటారు. బొగ్గు టిప్పర్లు పెనుబల్లి మండలం మీదుగా కొత్తగూడెం వెళ్తూ ఉంటాయి. వివిధ కంపెనీలు బొగ్గు టిప్పర్లను నడిపించటానికి అనుభవం లేని డ్రైవర్లను తీసుకొస్తున్నాయి. తక్కువ జీతాలకు తీసుకొచ్చి డ్రైవర్లకు టిప్పర్లు అప్పచెబుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ నుంచి బొగ్గు రవాణా చేసే టిప్పర్ల వేగం ప్రజలను బెంబేలెత్తిస్తోంది.

 

సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వివిధ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలకు చెందిన సుమారు 2 వందలకు పైగా టిప్పర్లు ప్రతిరోజూ బొగ్గు రవాణా చేస్తుంటాయి. తక్కువ సమయంలో ఎక్కువ బొగ్గు రవాణా చేయాలని యాజమాన్యాలు డ్రైవర్లకు ఆదేశాలు ఇస్తున్నాయి. బొగ్గు టిప్పర్ల డ్రైవర్లు అతి వేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. రోజుకు సాధారణంగా నాలుగు ట్రిప్పులు రవాణా చేయాలి. కానీ ఇక్కడి యాజమాన్యాల ధన దాహం వల్ల ఎక్కువ ట్రిప్పులు తిప్పుతున్నారు.  ఎక్కువ డబ్బులు వస్తాయని డ్రైవర్లకు చెబుతున్నారు యజమానులు. డ్రైవర్లు అతి వేగంగా వాహనాలు నడుపుతూ  ప్రమాదాలకు కారణమవుతున్నారు. నిత్యం ఎవరో ఒకరు బొగ్గు టిప్పర్లు ఢీకొట్టటంతో  ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

 

మరోవైపు...బొగ్గు రవాణా మార్గాల్లో ఎక్కువగా మలుపులు ఉంటున్నాయి. కనీసం రహదారి సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేయడం లేదు. జాతీయ రహదారులు కూడలిగా ఉన్న పెనుబల్లి మండలంలో బొగ్గును రవాణా చేస్తున్న టిప్పర్లు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఇటీవల జరిగిన వరుస ప్రమాదాలతో పలువురు మృత్యువాత పడ్డారు. బొగ్గు టిప్పర్లు రోడ్డులో వెళ్తున్నప్పుడు పైభాగంలో పూర్తిస్థాయిలో పట్టాలు కప్పాలి. అలా కాకుండా కొంతమేర మాత్రమే పట్టాలు కప్పుతున్నారు. ఓవర్ స్పీడ్‌తో వెనుక వచ్చే ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లారీల్లోని బొగ్గు పొడి ద్విచక్ర వాహనదారుల కళ్ళల్లో పడుతోంది. ఫలితంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రహదారి పక్కన ఉన్న ఇళ్లలోకి సైతం బొగ్గు పొడి పడటంతో ప్రజలు రోగాల పాలవుతున్నారు. బొగ్గు టిప్పర్ల కాలుష్యం వల్ల కొందరైతే లక్షలు ఖర్చు పెట్టి ఇళ్ళు‌ కట్టుకొని వాటిని వదిలేస్తున్నారు. బయట అద్దెకు ఇళ్లను తీసుకొని ఉంటున్నారు. బొగ్గు టిప్పర్ల బూడిద ఇళ్లలోకి చేరటంతో ఆహారం కలుషితం అవుతుంది. చిన్న పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చూడాల్సి వస్తుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు స్థానికులు. 


ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం బొగ్గు రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అనుభవం ఉన్న డ్రైవర్లను నియమించి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు స్థానికులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: